
వైద్యులు లేక..గాయపడ్డ కెమెరామెన్ మృతి
మంత్రి కెటిఆర్‌కు ట్వీట్ చేసిన దర్శకుడు నాగ్ అశ్విన్
హైదరాబాద్,నవంబర్27(జనంసాక్షి): నగరంలోని ప్రభుత్వాస్పత్రుల పనితీరు దారుణంగా ఉందని ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆస్పత్రికి వెళ్లిన తన స్నేహితుడికి సకాలంలో వైద్యం అందకపోవడంతో అతను మరణించాడని, ఏ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించినా ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదన్నారు. ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ మేరకు మంత్రి కెటిఆర్‌కు ట్వీట్ చేశారు. కెమెరామెన్‌గా పనిచేస్తున్న తనస్నేహితుడు ఒకరు ఆదివారం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడని,. చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో అతను చనిపోయారు. దీంతో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేస్తూ అశ్విన్ తన స్నేహితుడి పట్ల జరిగిన దారుణాన్ని వివరించారు. ఆదివారం రోడ్డు ప్రమాదంలో గాయపడిన నా స్నేహితుడు చనిపోయాడు. అతనికి ప్రమాదం జరిగినప్పుడు చికిత్స నిమత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత మూడు గంటల పాటు అతను చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడాడు. ఆ రోజు ఆదివారం కావడంతో వైద్యులు ఎవరూ అందుబాటులో లేరు. అతని తల్లిదండ్రులే స్టెచ్రర్‌పై పడుకోబెట్టి మోసుకుంటూ తిరిగారు. ఆ సమయంలో గాంధీ ఆస్పత్రిలో కాకుండా మరేదన్నా ఆస్పత్రికి తీసుకెళ్లినా నా స్నేహితుడు బతికేవాడు. తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్‌లోని ఓ ప్రభుత్వాస్పత్రికి తరలించి మనుషులు ప్రాణాలు ఎందుకు కాపాడుకోలేం? ప్రభుత్వాస్పత్రి అంటే చావుకు, నిర్లక్ష్యానికి పర్యాయపదం కాదు అని చెప్పడానికి ఏం చేయమంటారో చెప్పండి కేటీఆర్ సర్. వైద్యం అందక చనిపోయిన నా స్నేహితుడు ఈ రాష్ట్రంలోనే గొప్ప కెమెరామెన్. దీని గురించి నాకు ఎవర్ని ప్రశ్నించాలో అర్థం కావడంలేదు సర్. అనవసరంగా అలా వైద్యం అందక ఎవ్వరూ చనిపోకూడదు’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు అశ్విన్. ఈ విషయంపై కేటీఆర్ స్పందించాల్సి ఉంది. ఈ పోస్ట్ ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది.
గాంధీ ఆస్పత్రిలో తాండవించిన నిర్లక్ష్యం




