గాయకుడి కుటుంబం దారుణ హత్య
ఓక్సాకా: మెక్సికోలో ఓ గాయకుడి కుటుంబం దారుణ హత్యకు గురైంది. గాయకుడి ఇంట్లోకి చొరబడిన దుండగులు అతి కిరాతకంగా అతడి తల నరికి చంపేశారు. అతడి భార్య, కుమారుడిని కూడా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఓక్సాకా ప్రాంతానికి చెందిన విక్టర్ శాన్‌చెజ్ స్థానిక ట్రాపికల్ రాక్ బ్యాండ్‌లో గాయకుడు. అతడికి భార్య, 11ఏళ్ల కుమారుడు ఉన్నారు. కాగా.. గత రాత్రి విక్టర్ ఇంట్లోకి కొందరు దుండగులు ఆయుధాలతో చొరబడ్డారు. అతి దారుణంగా అతడి తల నరికి చంపేశారు. అనంతరం భార్యా, కుమారుడిపై తుపాకీతో కాల్పులు జరిపగా.. వారు అక్కడికక్కడే మృతిచెందారు. విక్టర్ హత్యకు గల కారణాలు తెలియరాలేదు. వ్యక్తిగత కక్షలతోనే అతడి కుటుంబాన్ని చంపేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే విక్టర్ ఇంటిపై గతంలోనూ కొన్ని సార్లు దాడి జరిగిన సంఘటనలున్నాయి.
ఓక్సాకాలో కుటుంబసభ్యులను దారుణంగా హత్య చేయడం ఇది రెండో ఘటన. గతవారం ప్యూర్టో ఎస్కాండిడో ప్రాంతంలో ఓ జాలరి ఇంట్లోకి చొరబడ్డ దుంగులు ఎనిమిది మంది కుటుంబసభ్యులను హత్య చేశారు.