గోదావరి జలాల్లో మన వాటాను పూర్తిగా వాడుకోడానికి.. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకేస్తున్నది. గోదావరిపై ఇప్పటికే పలు ప్రాజెక్టులను కట్టాలని నిర్ణయించిన సర్కార్.. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. ఎంపీ కవితతో పాటు జిల్లాలోని టిఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులు సీఎం కేసీఆర్‌ను కలిసి ప్రాజెక్టు వల్ల కలిగే లాభాలను చెప్పారు. దాంతో గుత్ప గ్రామం వద్ద ఓ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ ప్రాజెక్టుతో మక్లూర్ మండలంలోని గుత్ప, రాంచంద్రాపురం, మామిడిపల్లి, చిన్నాపూర్, మదన్‌పల్లి, వడ్యాట్, అమ్రాద్ గ్రామాలతో పాటు ఆర్మూర్ మండలంలోని అంకాపూర్, జక్రాన్‌పల్లి గ్రామాలకు సాగునీరు అందనున్నది. ఎత్తిపోతల పథకంతో జిల్లాలోని దాదాపు 30 కి పైగా చెరువులను నింపాలని.. ప్రభుత్వం భావిస్తున్నది. ఇంత ముఖ్యమైన ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయడానికి.. మొదటి విడతగా 23 కోట్ల 80లక్షల నిధులను విడుదల చేశారు.
ప్రాజెక్టుకు ఇప్పటికే పలు అనుమతులు లభించినా.. హైడ్రాలజికల్, ఇతర డిజైన్ల కోసం అనుమతి రావాల్సి ఉన్నది. అటు గోదావరి బేసిన్‌లోని గుత్ప ఎత్తిపోతల పథకానికి దాదాపు 2 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నయ్. ఈ ప్రాజెక్టుతో శ్రీరాం సాగర్ మిగులు జలాలు పూర్తిగా వాడుకునే అవకాశమున్నది. కాలువలు, పైప్ లైన్ వేసి సాగునీరు అందించకున్నా.. చుట్టుపక్కల ఉన్న 30 చెరువులను నింపే అవకాశమున్నది. దాంతో వేల ఎకరాల భూములు సాగులోకి వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. అటు గుత్ప వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌తో భూగర్భ జలాలు పెరగడంతో.. సాగు, తాగునీటికి ఇబ్బంది ఉండదని రైతన్నలు చెపుతున్నారు. గత ప్రభుత్వాల హయాంలోనే సర్వేలు జరిగినా.. స్వరాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టు కార్యరూపం దాల్చిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుతో నిజామబాద్ జిల్లా ప్రజల అవసరాలు తీరనున్నాయి. వర్షాలు లేని కాలంలోనూ రిజర్వాయర్ నీటితో చెరువులను నింపే అవకాశం ఉండడంతో.. సాగుకు ఎలాంటి కష్టం ఉండదని అధికారులు చెపుతున్నారు.




