అభివృద్ధి-సంక్షేమంలో రాష్ట్రం సాధించిన ఫలితాలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. రాష్ట్రం ఇరుగు, పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వక వైఖరిని అవలంభిస్తుందని మరోమారు స్పష్టం చేశారు. అదే స్ఫూర్తితో ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలు ఇచ్చాయని తెలిపారు. మరోవైపు రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. కృష్ణవేణి పుష్కర మహోత్సవ శుభాభివందనాలు చెప్పారు. హైదరాబాద్ గోల్కొండ కోటలో జరిగిన జెండావందనం కార్యక్రమంలో రాష్ట్ర ప్రజలనుద్దేశించి సీఎం మాట్లాడారు.
నీటి పారుదల, విద్యుత్ రంగాల్లో.. మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్ గఢ్ రాష్ట్రాలతో సయోధ్యను సాధించుకోగలిగామన్నారు సీఎం కేసీఆర్. మహారాష్ట్రతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయని చెప్పారు. ఫలితంగా కర్ణాటక నుంచి జూరాలకు ఒక టిఎంసి నీటిని విడుదల చేయించుకోగలిగామని.. చత్తీస్ గఢ్ తో 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదిరిందని తెలిపారు. మరోవైపు గత ప్రభుత్వాల విధానాల వల్లే గోదావరి ప్రాజెక్టుల నిర్మాణం ముందుకు సాగలేదని విమర్శించారు సీఎం కేసీఆర్.
సాగు, తాగు నీటి అవసరాలను తీర్చడానికి చేస్తున్న ప్రయత్నాలు, ప్రదర్శిస్తున్న నిబద్ధతను గౌరవ ప్రధాన మంత్రి మోడీ ప్రశంసించడం స్ఫూర్తిని నింపిందని సీఎం కేసీఆర్ అన్నారు.
కేంద్ర – రాష్ట్రాల సంబంధాలలో మన రాష్ట్రం సమాఖ్య స్ఫూర్తిని గౌరవిస్తున్నది. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యంగా వ్యవహరిస్తున్నది.
ఇటీవలే గౌరవ ప్రధాన మంత్రి నరేంద్రమోది గారు రాష్ట్రంలో పర్యటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ నదీ జలాలను నల్లాలద్వారా అందించే బృహత్తర కార్యక్రమం ‘మిషన్ భగీరథ’లో భాగంగా గజ్వేల్ నియోజకవర్గానికి తాగునీరందించే కార్యక్రమం ప్రారంభించారు. ప్రజల సాగు, తాగు నీటి అవసరాలను తీర్చడానికి మన ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను, ప్రదర్శిస్తున్న నిబద్ధతను గౌరవ ప్రధాన మంత్రి ప్రశంసించడంమనలో స్ఫూర్తిని నింపింది. ఇదే సందర్భంలో ఆరు అభివృద్ధి కార్యక్రమాలు మాననీయ ప్రధాన మంత్రి చేతుల మీదుగా శ్రీకారం చుట్టుకున్నాయి.
17 ఏండ్ల క్రితం మూతపడిన రామగుండం ఫర్టిలైజర్ ప్లాంటును తిరిగి తెరిపించాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. ప్రభుత్వ రంగ సంస్థలలో కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్న నేటి తరుణంలో ఈ ప్రయత్నం ఏటికి ఎదురీదడం అని తెలిసినా పట్టువిడవకుండా ప్రయత్నించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించి కేంద్రం సానుకూలంగా స్పందించడమే కాకుండా స్వయంగా ప్రధాన మంత్రి చేతుల మీదుగా ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణకు శంఖుస్థాపన జరిగింది. ఇది ఈ ప్రభుత్వం సాధించిన ఘన విజయంగా నిండు హర్షంతో ప్రకటిస్తున్నాను. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలంగాణ ప్రజల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందడమే కాకుండా.. ఎరువుల ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ది సాధించేందుకు ఉపయోగం కలుగుతుంది.
హైదరాబాద్ – కరీంనగర్ ల మధ్య నేరుగా రైలు నడపాలని నాలుగు జిల్లాల ప్రజలు దశాబ్దాలుగా కోరుతున్నారు. ఈ కోరిక నెరవేరేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలించి… మనోహరాబాద్ – కొత్తపల్లి రైల్వే లైను పనులకు ప్రధాన మంత్రిగారు శంఖుస్థాపన చేశారు.
తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు అవసరాలను తీర్చడానికి రామగుండంలో నాలుగు వేల మెగావాట్ల ఎన్.టి.పి.సి. విద్యుత్ ప్లాంటు ఏర్పాటు చేయడానికి నిర్ణయించి, అందులో మొదటి దశ ప్లాంటు నిర్మాణ పనులకు కూడా ప్రధాన మంత్రి గారు శంఖుస్థాపన చేశారు. శంఖుస్థాపన చేసిన పనులన్నీ వేగంగా పూర్తి చేస్తామని ప్రధానమంత్రి గారు హామీ ఇచ్చారు.
ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి కంపెనీ నిర్మించిన 1200 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు ప్రధాన మంత్రి చేతుల మీదుగా జాతికి అంకితం కావడం మనందరికీ గర్వకారణం.
నేషనల్ హైవేల విషయంలో మన రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని పలుమార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయాము. ఈ విషయంలో కూడా కేంద్రం సానుకూలంగా స్పందించింది.
రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణలో 2,592 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉండేది. ఈ రెండేళ్లలో కొత్తగా 1,951 కిలోమీటర్ల జాతీయ రహదారి మంజూరు చేయించుకోగలిగాం. దీంతో తెలంగాణలో జాతీయ రహదారుల పొడవు మొత్తం 4,590 కి.మీకు చేరుకుంటున్నది. గతంలో తెలంగాణలో జాతీయరహదారుల సగటు 2.25 కిలోమీటర్లు మాత్రమే ఉండేది. ఇప్పుడు 4 కిలోమీటర్లకు చేరుతున్నది. జాతీయ సగటు 3శాతం కంటే తక్కువున్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు జాతీయ సగటును మించుతుండడం సంతోషకరమన్నారు సీఎం కేసీఆర్.




