హైదరాబాద్,నవంబర్1(జనంసాక్షి): హైదరాబాద్‌లో గురువారం దారుణం చోటుచేసుకుంది. ఇక్కడి శంకర్ నగర్ లో ఉన్న ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. అంతేకాకుండా ఇంట్లోని ఫర్నీచర్ మొత్తం ధ్వంసమైంది. శంకర్ నగర్ లో ఉన్న మూడు అంతస్తుల భవనంలో ప్రియ అనే యువతి తన తల్లిదండ్రులతో మొదటి అంతస్తులో ఉంటోంది. ఈ నేపథ్యంలో ఉదయం టిఫిన్ చేసేందుకు ప్రియ తల్లి కిచెన్ లోకి వెళ్లింది. అయితే రాత్రిపూట గ్యాస్ లీక్ కావడం గమనించని ఆమె స్టవ్ వెలిగించేందుకు యత్నించడంతో మంటలు ఒక్కసారిగా ఇళ్లు మొత్తం వ్యాపించాయి. రాత్రిపూట తలుపులు, కిటికీలన్నీ మూసేయడంతో గ్యాస్ బయటకు వెళ్లపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఈ ఘటనలో ప్రియతో పాటు ఆమె తండ్రి జనార్ధన్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. పేలుడు శబ్ధం విన్న స్థానికులు వీరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.




