Wednesday, 4 November 2026

గ్యాస్‌లీక్‌తో ప్రజల బెంబేలు

సంఘటనా స్థానాన్ని సందర్శించిన కలెక్టర్‌
విజయవాడ, ఫిబ్రవరి23(జ‌నంసాక్షి): కృష్ణా జిల్లాలో గ్యాస్‌ పైపులు దడపుట్టిస్తున్నాయి. చినపండ్రాక ఓఎన్‌జీసీ ప్లాంట్‌ నుంచి గ్యాస్‌ లీకవుతోంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి గ్యాస్‌ లీక్‌ అవుతూనే ఉంది. దీంతో పరిసర గ్రామాలకు కూడా గ్యాస్‌ విస్తరిస్తోంది. ఇప్పటికే 30 ఎకరాలకు పైగా గ్యాస్‌, క్రూడాయిల్‌ విస్తరించింది. దీని వల్ల రైతులకు భారీ నష్టం వాటిల్లింది. చుట్టుపక్కల గ్రామస్తులంతా భయాందోళనలో ఉన్నారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తగా ఉంది. అధికారులు గ్యాస్‌ లీకేజీని బ్లో అవుట్‌గా ప్రకటించారు. బ్లోఅవుట్‌ను నియంత్రించడానికి నిపుణుల బృందం చినపాండ్రాకు రానుంది. రాజమండ్రిలో ఉన్న ఓఎన్జీసీ ప్రధాన కార్యాలయం అధికారులు ఘటనా స్థలానికి ఇంకా చేరుకోలేదని పలువురు పేర్కొన్నారు. అయితే ఎలాంటి ప్రయమాదంలేదని, జాగ్రత్త చర్యలు తీసుకున్నామని కలెక్టర్‌ బాబు ప్రకటించారు. ప్రజలకు ఎలాంటి భయం అక్కర్లేదన్నారు. కృత్తివెన్ను  మండలంలోని చినపాండ్రేక పంచాయతీలోని ఓఎన్జీసీ బావుల నుంచి క్రూడాయిలు లీకవుతుండటంతో జిల్లా కలెక్టరు బాబు.ఎ సంఘటన స్థలాన్ని సోమవారం పరిశీలించారు. ఈ ఆయిలు వ్యాపించటంతో దాదాపు 25ఎకరాల్లో వరి పంట, 60కొబ్బరి చెట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. రైతులకు వారంలోజుల్లో ఓఎన్జీసీ నుంచి నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టరు హావిూ ఇచ్చారు. గత నాలుగేళ్లుగా ఈ బావుల నుంచి

క్రూడాయిల్‌ తీస్తున్నారు. ఇటీవల కాలంలో 5 పర్యాయాలు ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ పరిణామంతో చినపాండ్రేక గ్రామస్థులు భయాందోళనతో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *