మినరల్ వాటర్ ప్లాంట్లకు కలసి వస్తున్న కాలం
హైదరాబాద్,ఆగస్ట్8(జనం సాక్షి): వర్షాకాలంలో కూడా గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. వర్షాభావంతో పాటు గ్రామాల్లో మిషన్ భగీరత ప్రారంభం కాకపోవడంతో మంచినీటి సరషరా ఇంకా కలగానే ఉంది. ఇదే అదనుగా మినరల్ వాటర్ పేరుతో గ్రామాల్లో నీటి వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. ప్రజలు కూడా నల్లా నీళ్లకన్నామినరల్ వాటర్‌కే మొగ్గు చూపుతున్నారు. దీనికితోడు నల్లా నీళ్లపై దుష్పచ్రారం కూడా వ్యాపారులకు కలసి వస్తోంది. దీంతో అధిక రేట్లకు నీటిని విక్రయాలు జరుపుతున్నారు. వర్షాకాలం వచ్చినా నీటి గోస తప్పకపోవడంతో నీటి ఎద్దడి అన్ని ప్రాంతాల్లో ఉండడంతో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్లు పెట్టి జోరుగా వ్యాపారాలు చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేనప్పటికీ వ్యాపారులు ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి విచ్చలవిడిగా విక్రయాలు నిర్వహిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. మంచినీటి ఎద్దడి ఏర్పడడంతో ప్రజలు విధిలేని పరిస్థితుల్లో ప్యూరిఫైడ్ వాటర్‌ను కొనుగోలు చేస్తున్నారు. అడ్డూఅదపు లేకుండా సాగుతున్న మంచినీటి వ్యాపరాంతో కొందరు బాగా దండుకుంటున్నారు. నాణ్యత లేని ప్యూరిఫైడ్ వాటర్ సరఫరా చేస్తూ లాభాలు గడిస్తున్నారు. దీనికి స్థానిక నేతలు సహకారం అందిస్తున్నారు. మంచినీటి కొరతలను నీటి సరఫరాదారులు వ్యాపారం చేసుకుంటున్నారు. దీంతో అధికారులు కూడా చూసీచూడనట్లు ఉంటున్నారు. వాటర్‌ప్లాంట్ నిర్వాహకులు నిబంధనలు పాటించడంలేదు. అధికారుల తనిఖీలు
లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని వ్యాపారులు నిబంధనలకు విరుద్దంగా ప్లాంట్లను నిర్వహిస్తూ అధిక రేటుకు విక్రయాలు జరుపుతున్నారు. వ్యాపారులు నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరి స్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇలా మారుమూల గ్రామాలకు కూడా క్యాన్లలో నీటిని తరలిస్తున్నారు. అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్న ప్యూరిఫైడ్ వాటర్ నిర్వాహకులపై చర్యలు చేపట్టి నాణ్యమైన నీరు అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. అయితే మిషన్ భగీరథ పూర్తయితే గ్రామాల్లో ప్లాంట్లు మూతపడతాయని అధికారులు అంటున్నారు.




