Wednesday, 4 November 2026

గ్రామాల్లో ఇప్పుడు కొత్త ట్రెండ్‌

ఏకగ్రీవ తీర్మానలంటూ జోరుగా ప్రచారం

నేతల మెప్పుకోసం గులాబీ దళాల ఎత్తుగడ

హైదరాబాద్‌,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): ఇప్పుడు గ్రామాల్లో గులాబీ దళాలు కొత్త ఎత్తులు వేస్తున్నాయి. గ్రామల్లో పర్యటించి ఏకగ్రీవం అంటూ తీర్మానాలు చేయిస్తున్నాయి. తమ గ్రామ ఓట్లు ఫలానా వ్యక్తికే

ఆ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపిస్తామని పల్లెలన్నీ ప్రతినబూనుతున్నాయంటూ ప్రకటనలు

గుప్పిస్తున్నాయి. ఆయా ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా మరోసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటామని ప్రతిజ్ఞలు చేస్తున్నట్లుగా ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. మరోవైపు జిల్లాలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నారు. అంతేగాకుండా టీఆర్‌ఎస్‌ చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఆ పార్టీ అభ్యర్థులకే ఓటేస్తామనే స్టిక్కర్లు కూడా గ్రామాల్లో వెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌కు ఎదురులేదనే విషయం తేలిపోయిందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. గులాబీ దళానికి ప్రజల నుంచి వస్తున్న స్పందనతో ప్రతిపక్షాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. నేతలను మచ్చిక చేసుకునేందుకు క్షేత్రస్థాయిలో కొందరు ఈ రకమైన ప్రచార సరళిని అనుసరిస్తున్నారు. ఏం చేయాలో తెలియక ఆ పార్టీలకు చెందిన నాయకులు తలలు పట్టుకుంటున్నారని విమర్వుల గుప్పిస్తున్నారు. నిజానికి ఒక్క టిఆర్‌ఎస్‌ మా/-తరమే ఇప్పుడు ప్రచారంలో ఉంది. మిగతా పార్టీలో అసలు రంగంలోకి దిగనేలేదు. దీంతో పొత్తులతో అభ్యర్థులకు ఖరారు కాక ఆందోళనలో ఉన్న విపక్షాలు కారు స్పీడ్‌కు బేజారవుతున్నాయన్న ప్రచారం కల్పిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టేందుకు ప్రజలంతా సన్నద్ధం అవుతున్నారంటూ ప్రచారం చేపట్టారు. అన్ని జిల్లాలోనిప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది. గడిచిన నాలుగున్నరేళ్లలో టీఆర్‌ఎస్‌ చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలు స్వచ్ఛందంగా మద్ధతు ప్రకటిస్తున్నారని చెబుతున్నారు. నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని స్థానికులు తీర్మానాలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో కూడిన స్టిక్కర్లు ఆవిష్కరించి ఇంటింటికీ అంటించారు. అలాగే టీఆర్‌ఎస్‌లోకి చేరికలు కొనసాగుతున్నాయి. వివిధ కులసంఘాలతో సమావేశం అవుతూ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కుల సంఘాలకు పెద్దపీట విషయాన్ని గుర్తు చేస్తూ రానున్న రోజుల్లో మరింతగా అభివృద్ధి చెందాలంటే కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని పిలుపునిస్తున్నారు. ఈ కమిటీల ద్వారా రానున్న రోజుల్లో ప్రచారం మరింత వేగవంతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇలా టీఆర్‌ఎస్‌ శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో ప్రచారం నిర్వహిస్తున్నారు. తమ తమ అభ్యర్థుల గెలుపే ప్రధాన ధ్యేయంగా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. టీఆర్‌ఎస్‌ చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతున్నారు. ఇలా నియోజకవర్గాల్లో గులాబీదళం దూసుకుపోతోంది. రాజకీయాలకు అతీతంగా ఊరూవాడా ఏకమై టీఆర్‌ఎస్‌కే అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేయిస్తున్నాయి. నియోజకవర్గం అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నేతనే మళ్లీ గెలిపించుకుంటామని చెబుతున్నాయి. మరోవైపు

నియోజకవర్గాలకు వచ్చిన గులాబీ అభ్యర్థులకు పార్టీశ్రేణులు, అభిమానులు, ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. టీఆర్‌ఎస్‌కే మా ఓటు.. మా అభివృద్ధి ప్రదాత.. అంటూ నినాదాలు చేశారు. ఇక అప్పటి నుంచి అన్నివర్గాల ప్రజలు, వివిధ కుల వృత్తుల వారు ఏకమై ప్రతిజ్ఞలు చేస్తున్నారు. 60 ఏళ్లలో కానరాని అభివృద్ధిని నాలుగేళ్లలోనే కండ్లజూస్తున్నామని, మరో పదేళ్లు కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా చూడాలన్నదే తమ కోరిక అంటూ అన్నివర్గాల ప్రజలు కదిలేలా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పల్లెలన్నీ గులాబీ మయంగా మారుతున్నాయి. తమకు ఆసరా పింఛన్‌ అందిందని.. కల్యాణలక్ష్మి వచ్చిందని..

ఏళ్ల తరబడి కాని తమ భూమి పట్టా అయిందని, తమ పంటలకు పెట్టుబడి అందిందని.. చెరువులో చేపలు పోయడంతో ఉపాధి దొరికిందని, సబ్సిడీ గొర్రెలు ఇచ్చిన టీఆర్‌ఎస్‌కే ఓటేసి రుణం తీర్చుకుంటామని అన్ని వర్గాల ద్వారా ప్రకటనలు వస్తున్నాయి. దశాబ్దాలుగా మరమ్మతులకు నోచుకోని తమ చెరువు బాగుపడిందని,

ఎండాకాలంలో ఇంటికి గోదారమ్మ వచ్చితమ గొంతులు తడిపిందని, మా బిడ్డ ప్రభుత్వ దవాఖానలో ప్రసవాలు, కేసీఆర్‌ కిట్లతో తమకు ఆర్థిక భారం దూరం అయిందని.. ఇలా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన టీఆర్‌ఎస్‌కే తమ మద్దతు ఉంటుందని అంటున్నాయి. ఈ క్రమంలో ప్రతిపక్షాలు రానేరావొద్దని ఊళ్లకు ఊళ్లు తీర్మానాలు చేస్తుండడం గమనార్హం. ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నారు. ఇక భారీ మెజార్టీయే లక్ష్యంగా కృషి చేస్తున్నామని టీఆర్‌ఎస్‌ శ్రేణులు అంటున్నాయి. పల్లెపల్లెనా సీసీ రోడ్లు.. చెరువులన్నీ మిషన్‌ కాకతీయలో మరమ్మతు.. ఇంటింటికీ మొదటి విడతలోనే మిషన్‌ భగీరథ నీరు ఇచ్చిన కేసీఆర్‌కే అండగా ఉంటామని జనమంతా అంటున్నారని నాయకులు చెబుతున్నారు.