ఆడపడచుల రాకతో మొదలయిన ఆటాపాటా
పూలవ్యాపారులకు భలే గిరాకీ
హైదరాబాద్,సెప్టెంబర్30 (జనంసాక్షి): పూల పండగను తీసుకుని వచ్చిన బతుకమ్మ సంబరాలు తెలంగాణ
వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎక్కడ చూసినా పూల అమ్మకాలు బాగా కనిపించాయి. తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ సంబురం రాకతో తెలంగాణ లోగిళ్లలో పండగ కళ వచ్చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత వైభవంగా జరిగే బతుకమ్మ కోసం ఆడపడుచులు తమ స్వగ్రామాలకు చేరుకున్నారు. అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థినులు, మహిళలు స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. ఆశ్వయుజ పాడ్యమి ముందు రోజు వచ్చే అమావాస్యను పితృ మావాస్య(పెతరమాస)గా పిలుస్తారు. ఇదే రోజున ఎంగిలి పూల బతుకమ్మను ఆడతారు. తొమ్మిది రోజులు ఆడే బతుకమ్మ ఎంగిలి పూలతో ఆరంభం అవుతుంది. అమావాస్య నుంచి మొదలైన బతుకమ్మ ఆట తొమ్మిది రోజులు ఆడతారు.రోజూ ఆటల్లో పడి ఇంటి, పంట పనులు మరిచి పోతారు. ఆరో రోజున బతుకమ్మను పక్కకు పెట్టి మిగిలిపోయిన పనులు చూసుకుంటారు. బతుకమ్మల రాకతో పూలకు గిరాకి పెరిగింది. వర్షాలు పడడంతో పూల ఉత్పత్తులు కూడా బాగా వచ్చాయి. రైతులు సాగుచేసిన బంతిపూల తోటలకు బతుకమ్మ పండగ గిరాకీ ఏర్పడింది. బతుకమ్మ పండగ నేపథ్యంలో విక్రయాలు జరుగుతాయనే ముందుచూపుతోనే రైతులు ఈ పూల సాగుచేపట్టగా సరిగ్గా పండగ సమయానికే పువ్వులు విచ్చుకొని ఉపయోగానికి వచ్చాయి. దీంతో రైతులు విక్రయం చేపట్టారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రయాణికులు భారీగా కొనుగోలు చేస్తున్నారు. తమకు నచ్చిన పూలను కోసుకుంటూ కొనుగోలు చేస్తున్నారు. విక్రయాలు ప్రారంభంకాగా కారుల్లో వెళ్తున్న పలువురు మహిళలు పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పే బతుకమ్మ పండుగ కోలాహలం అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యింది. ఇప్పటికే ప్లలెల్లో పండగ శోభ సంతరించుకుంది. చిన్నారుల నుంచి వృద్ధుల దాకా.. బతకమ్మ సంబరాలను ఆస్వాదించడానికి గ్రామాలకు చేరుకున్నారు. ఇన్నాళ్లు చదువులకు పట్టణం వెళ్లినా.. పండగ నేపథ్యంలో విద్యార్థినులు సొంతూరుకు చేరుకున్నారు. దీంతో ఇళ్లలో ఆడ బిడ్డల సందడి మొదలయింది. ఆడపిల్లలు ఆత్మీయ దేవతగా ఆరాధించే బతుకమ్మ ప్రకృతి ప్రాముఖ్యతను చాటుతుంది. ఇక వరుసగా గత నాలుగేళ్లుగా వైభవంగా బతుమ్మను నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఈ యేడు కూడా ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తోంది.ప్రధాన కూడళ్లల్లో బతుకమ్మ కమాన్లను నిర్మించారు. ఈ ఏర్పాట్లపై మేయర్ బొంతు రామ్మోహన్, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ప్రత్యేక శ్రద్దతో పనిచేస్తున్నారు.
గ్రామాల్లో బతుకమ్మ సందడి




