Thursday, 5 November 2026

గ్రామాల సమగ్రాభివృద్ధికి చర్యలు

 

గ్రామదర్శినలో ఎమ్మెల్యే చింతమనేని

ఏలూరు,నవంబర్‌10(జ‌నంసాక్షి): మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా గ్రామాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ అన్నారు. దెందులూరు మండలం దోసపాడు, పోతునూరు, సత్యనారాయణపురం గ్రామాల్లో గ్రామ దర్శిని- గ్రామ వికాసిని కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామాల్లో పెద్ద సంఖ్యలో సిమెంట్‌ రహదారులు నిర్మించమన్నారు. సంపూర్ణ పారిశుద్ధ్య ఉద్యమంలో భాగంగా భూగర్భ మురుగు కాలువల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. దోసపాడులో రూ.50 లక్షల వ్యయంతో నిర్మించే సిమెంట్‌ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సుశీల, జడ్పీటీసీ సభ్యురాలు సక్కుకుమారి, ఏఎంసీ ఛైర్మన్‌ సురేంద్రనాథ్‌ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

పోలవరాన్ని సందర్శించిన ఎన్జీవో నేతలు

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని ఏపీ ఎన్జీవోస్‌ అసోసియేషన్‌ సభ్యులు శనివారం సందర్శించారు. ఎన్జీవోస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అశోక్‌బాబు నేతృత్వంలో వారంతా ప్రాజెక్టులో జరుగుతున్న స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్‌, ఎర్త్‌ కమ్‌ ర్యాక్‌ఫిల్‌ డ్యాం, ఎగువ, దిగువ కాపర్‌ డ్యాం నిర్మాణ పనులను పరిశీలించారు. తొలుత పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని, ఇటుకల కోట వద్ద కుడి కాలువపై నిర్మించిన డెలివరీ వ్యవస్థను సందర్శించారు. పోలవరం ప్రాజెక్టుపై అవగాహనకే ఇక్కడికి వచ్చినట్లు అసోసియేషన్‌ సభ్యులు తెలిపారు.