Monday, 2 November 2026

గ్రూప్‌ -2కు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

 

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 14,(జనంసాక్షి): గ్రూప్‌ 2 ఉద్యోగాల నియామక పక్రియకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అలాగే అభ్యర్ధుల సర్టిఫికెట్లను పరిశీలించుకోవచ్చని కూడా టీఎస్‌పీఎస్సీకి సూచించింది. ఇంటర్వ్యూలో అంతేగాక 1:3 రేషియోలో పిలిచినందుకు ఏమైనా అభ్యంతరాలు వస్తే కోర్టుకు రావచ్చని పిటిషనర్‌కు, టీఎస్‌పీఎస్సీని ఆదేశించింది. కాగా… జూన్‌ 12 నుంచి మూడు వారాలు స్టే కొనసాగడం, ఆ తరువాత స్టే కాలం ముగియడంతో మెయిన్‌ పిటిషన్‌పై గురువారం వాదనలు కొనసాగాయి. అనంతరం తదుపరి విచారణ అక్టోబర్‌ 9వతేదీకి వాయిదా వేశారు. అలాగే వచ్చే నెల 9వ తేదీలోపు సర్టిఫికెట్లను పరిశీలించుకోవాలని టీఎస్‌పీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. దీనిపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలపాలని న్యాయస్థానం కోరుతూ తదుపరి విచారణను వచ్చే నెల 9వతేదీకి హైకోర్టు వాయిదా వేసింది. గ్రూప్‌- 2 పోస్టుల భర్తీ కోసం జారీచేసిన 2015 నోటిఫికేషన్‌, 2016 అనుబంధ నోటిఫికేషన్‌ ప్రకారం నిర్వహించిన పరీక్షల్లో ప్రశ్నలు, కీ లో జవాబులు తప్పుగా ఉన్నాయంటూ 18 మంది పిటిషన్‌ దాఖలు చేశారు.

నవంబర్‌ 11, 13 తేదీల్లో నిర్వహించిన గ్రూప్‌-2 పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీని డిసెంబర్‌ 2వ తేదీన టీఎస్‌పీఎస్సీ రిలీజ్‌ చేసింది. ఈ ప్రాథమిక కీపై డిసెంబర్‌ 5-14 తేదీల్లో అభ్యంతరాలు స్వీకరించింది.గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ ప్రకారం 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలువాల్సి ఉంటుంది. అంతకంటే ముందు అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించాలి. నిబంధనలకు అనుగుణంగా అర్హతలు లేనివారిని తిరస్కరించి, అర్హులైన ఇతర అభ్యర్థులను మళ్లీ ఇంటర్వ్యూలకు పిలువాల్సి ఉంటుంది. ఈ పక్రియ వల్ల ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున ఆలస్యాన్ని నిరోధించడానికి సర్టిఫికెట్ల పరిశీలనకు 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను పిలువాలని కమిషన్‌ నిర్ణయించింది. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన తర్వాత 1:2 నిష్పత్తి ప్రకారం అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తామని తెలిపింది. సర్టిఫికెట్ల పరిశీలనకు 1:3 నిష్పత్తి ప్రకారం మొత్తం 1032 పోస్టులకు గాను 3096 అభ్యర్థులను పిలువాల్సి ఉంటుంది. దివ్యాంగుల జాబితాలో తిరస్కరణలు ఎక్కువగా ఉండే అవకాశమున్నందున ఆ కోటాలో 1:5 నిష్పత్తిలో అభ్యర్థులను పిలువాలని నిర్ణయించారు. దీనిప్రకారం మొత్తం 3147 మంది అభ్యర్థులను సర్టిఫికెట్ల పరిశీలనకు పిలుస్తామని కమిషన్‌ వెల్లడించింది.