ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
నృత్యాలతో సందడి చేసిన గిరిజనం
హైదరాబాద్,ఆగస్ట్9(జనంసాక్షి): ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మాసబ్‌ట్యాంక్‌లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్‌లో గుస్సాడి, దింసా నృత్యాలతో ఆదివాసీలు సందడి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిరిజన మంత్రి సత్యవతి రాథోడ్ హాజరయ్యారు. విశిష్ట, ప్రత్యేక అతిథులుగా ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, స్థానిక ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ విూరజ్, పద్మశ్రీ గుస్సాడి కనకరాజు, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా, అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి, నవీన్ నికోలస్, సంయుక్త సంచాలకులు సముజ్వల, కళ్యాణ్ రెడ్డి, విజయలక్ష్మి, లక్ష్మి ప్రసాద్, గిరిజన మ్యూజియం క్యూరేటర్ డాక్టర్ సత్యనారాయణ, జీసీసీ మేనేజింగ్ డైరెక్టర్ సీతారాం నాయక్, చీఫ్ ఇంజనీర్ శంకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీల అభ్యున్నతి కోసం పనిచేసిన గొప్ప వారిని సన్మానించారు. 10 మంది గిరిజన పారిశ్రామిక వేత్తలకు సీఎం ఎస్టీ ఎంటర్ ప్రెన్యుర్ షిప్ పథకం కింద 4.4 కోట్ల చెక్ అందించారు. అటవీ నుంచి నాణ్యమైన తేనేను ఉత్పత్తి చేసే వారికి రూ. 90 లక్షల విలువైన తేనె సేకరణ ఉపకరణాలు అందించారు. ఆదివాసీ మూలికా వైద్య విశిష్టత తెలిపే పుస్తకం, గోండు పద కోశం, పచ్చబొట్ల వైద్యం, ఆదివాసీల ఆహార, సంప్రదాయాలు తెలిపే పుస్తకాలు ఆవిష్కరించారు. గురుకులాల్లో చదువుతూ దేశంలో ప్రముఖ ప్రవేశ పరీక్షల్లో సీట్లు సాధించిన 183 మంది విద్యార్థులకు ల్యాప్ టాప్ లు అందించడంలో భాగంగా వేదిక విూద నేడు 10 మంది ఆదివాసీ విద్యార్థులకు ల్యాప్ టాప్ లు అందించారు.