చంద్రబాబుది నయవంచన దీక్ష

– నాలుగేళ్లలో ఏం అభివృద్ధి చేశారని నవ నిర్మాణ దీక్షలు

– చంద్రబాబు మోసాలను ప్రజలు గమనిస్తున్నారు

– 2019లో బాబుకు గుణపాఠం తప్పదు

– వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి

కడప, జూన్‌2(జ‌నం సాక్షి) : ఏం సాధించారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నవ నిర్మాణ దీక్ష చేస్తున్నారని.. చంద్రబాబు చేపట్టిన దీక్ష.. నవనిర్మాణ దీక్ష కాదని, అది నయవంచన దీక్ష అని ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నాలుగేళ్ల టీడీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. ఎన్నికల హయాంలో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వాగ్ధానాలను పూర్తిగా విస్మరించి తుంగలో తొక్కారన్నారు. వారిద్దరూ మోసగించే కార్యక్రమాలు చేశారే తప్ప.. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని చెప్పారు. చంద్రబాబు సొంత ప్రయోజనాల కోసమే ఆదాయం వచ్చే పోలవరం, రాజధాని అమరావతి, పట్టిసీమ లాంటి కార్యక్రమాలు చేపట్టి కోట్లు దండుకున్నారని విమర్శించారు. నాలుగేళ్లలో ఏమి అభివృద్ధి చేశారని నవ నిర్మాణ దీక్షలు చేస్తున్నారని నిలదీశారు. ఇది సిగ్గుచేటైన కార్యక్రమన్నారు. నవ నిర్మాణ దీక్షలకు ప్రజలెవరూ రాకపోవడంతో పింఛన్ల కోసం వచ్చిన వారిని కూర్చోబెట్టి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. కాపులను బీసీల్లో చేరుస్తామన్నారు. వాల్మీకులను ఎస్టీల్లో చేస్తామని.. మాదిగలకు ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేయలేదా? అని ప్రశ్నించారు. ప్రజలంతా చంద్రబాబు మోసాలను గమనిస్తున్నారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పి టీడీపీని భూస్థాపితం చేయడం ఖాయమని రవీంద్రనాథ్‌రెడ్డి జ్యోసం చెప్పారు.