Tuesday, 3 November 2026

రాష్ట్ర పండుగా?.. టీఆర్‌ఎస్‌ పండుగా?

– ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం నడవటం లేదు

– అవినీతి, నిరక్షరాస్యతలో తెలంగాణ ముందుంది

– రూ.4వేలతో రైతులకు అన్ని సరిపోతాయా?

– సామాజిక తెలంగాణ సాధనే తమ లక్ష్యం

– తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం

హైదరాబాద్‌, జూన్‌2(జ‌నం సాక్షి) : ప్రతికల్లో ఇచ్చిన ప్రకటనలు చూస్తుంటే ఇది రాష్ట్ర పండుగా..? తెరాస పండుగా? అర్థం కావటం లేదని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. శనివారం తెలంగాణ జన సమితి పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సమితి అధ్యక్షుడు కోదండరాం జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వంపై కోదండరాం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది రాష్ట్ర పండుగో.. టీఆర్‌ఎస్‌ పండుగో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. పత్రికలకు ఇచ్చిన ప్రకటనల్లో ప్రభుత్వ పథకాల ప్రచారం తప్ప ఎక్కడా ఉద్యమ స్పూర్తి లేదని తెలిపారు. ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రస్తుత ప్రభుత్వం నడవటం లేదని ఆరోపించారు. అవినీతి, నిరక్ష్యరాస్యతలో తెలంగాణ ముందుందని వ్యాఖ్యానించారు. రైతు ఆత్మహత్యలకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదని, నాలుగు వేలతో రైతుకు అన్ని సమస్యలు తీరిపోతాయా? అని ప్రశ్నించారు. తెలంగాణలో జయశంకర్‌ ఆశయాలు నెరవేరటం లేదని మండిపడ్డారు. సామాజిక తెలంగాణ సాధనే తమ లక్ష్యమని కోదండరాం స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులను పక్కనపెట్టి ఆంధ్రాపె త్తం దారులకు కేసీఆర్‌ పెద్దపీట వేసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమ సమయంలో ఎస్సీలను సీఎం పీఠం పై కూర్చోబెడతానన్న కేసీఆర్‌ క్యాబినెట్‌లో దళితులు, మహిళలకు ప్రాధాన్యత నివ్వకపోవటం దుర్మార్ఘమైన చర్య అని మండిపడ్డారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో విఫలమవుతుందని,దానిన ఇకప్పిపుచ్చుకొనేందుకు రైతుబంధును ప్రవేశపెట్టి దేశానికే తెలంగాణ ఆదర్శం అంటూ కేసీఆర్‌ గొప్పలు చెప్పుకుంటున్నారని కోదంరాం విమర్శించారు. ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టుల్లో అవినీతి అక్రమాలు జరిగాయని, రాష్ట్ర వ్యాప్తంగా అవినీతీ స్థాయి తీవ్రంగా ఉందని కాగ్‌ తేల్చిందని, కాగ్‌ నివేదికతో తెరాస పాలన విధానం బట్టబయలైందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేసీఆర్‌ అధికారంలోకి రాగానే నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో జనసమితి పోటీ చేస్తుందని, కేసీఆర్‌ విధానాలను ప్రజల్లో ఎండగడతామని కోదండరాం తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసమితి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

——————————————