చంద్రబాబు అడ్డుకుంటే కృష్ణాగోదావరి నీళ్లు ఆగుతాయా
కెసిఆర్ ఆరోపణలపై మండిపడ్డ రేవంత్
మేడ్చల్,నవంబర్22(జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మేడ్చల్‌లో నిర్వహించనున్న యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా సభ ఏర్పాట్లను రేవంత్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తెలంగాణలో ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలకు ఆయన దీటుగా బదులిచ్చారు. కృష్ణాజలాలు కర్ణాటక నుంచి తెలంగాణకు వస్తున్నాయని, తెలంగాణ గేట్లు తెరిస్తేనే ఆంధ్రాకు నీళ్లు వెళ్తాయన్నారు. కృష్ణా జలాలు తెలంగాణకు రాకుండా అడ్డుకునేవారు ఎవరన్నా ఉన్నారంటే అది కర్ణాటక మాత్రమేనన్నారు. గోదావరి జలాలు కూడా మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వస్తాయని, తెలంగాణ వదిలితేనే గోదావరి జలాలు ఆంధ్రాకు వెళ్తాయని వివరించారు. అందువల్ల కృష్ణా, గోదావరి నీటిని చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆరోపించడం సరికాదన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం చేతకాకే రీడిజైనింగ్ పేరిట పూర్తి చేస్తానని
దోచుకుంటుంటే ప్రశ్నించినందుకు, అనుమతుల విషయాన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు అడిగినందుకే చంద్రబాబుపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణానికి చంద్రబాబు ఏ విధంగానూ అడ్డంకి కాదని, ఒకవేళ ఆపాలనుకున్నా ఆయన ఆపలేరని స్పష్టంచేశారు. అతి తెలివితేటలకు పరాకాష్టగా కేసీఆర్ వ్యవహార శైలి ఉందన్నారు. కేసీఆర్, కేటీఆర్ బిల్లా రంగాల్లాగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఫాంహౌస్‌లో పడుకుంటానని సీఎం అనడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని వ్యాఖ్యానించారు. కేటీఆర్ ఓ ఆర్థిక నేరగాడని, ఇసుక దందాలు చేసి ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్నికల తర్వాత కేటీఆర్‌ను వదిలేది లేదన్నారు. కేటీఆర్ ఆర్థిక నేరాలను వెలుగులోకి తెస్తామని, ఆయన దేశం విడిచి పారిపోకుండా అధికారులు చూడాలని కోరారు. కొడంగల్ ప్రజల కష్టాలు తీరుస్తానని కేటీఆర్ మాయమాటలు చెబుతున్నారని విమర్శించారు. కూట్ల రాయి తీయలేనోడు ఏట్ల రాయితీసినట్లుగా ఉందన్నారు. చంద్రబాబు అడ్డం పడితే ఏ దందాలు ఆగాయని అన్నారు.




