చంద్రబాబు బతుకంతా..  దొంగ రాజకీయాలే


– రాజకీయాలు చేయాలంటే మగాడిలా ముందుకురావాలి
– శిఖండి రాజకీయాలు చేస్తే గుణపాఠం తప్పదు
– తెలంగాణ ప్రజలు నీకుట్రలను తరిమేందుకు సిద్ధంగా ఉన్నారు
– విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్‌ నాయకుడు గట్టు రామచంద్రరావు
హైదరాబాద్‌, సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి) : తెలంగాణలో రాజకీయాలు చేయాలంటే చంద్రబాబు మగాడిలా ముందుకు రావాలని, కానీ దొంగలా రావొద్దని టీఆర్‌ఎస్‌ నాయకుడు గట్టు రామచంద్రరావు సవాల్‌ చేశారు. తెలంగాణ భవన్‌లో గట్టు రామచంద్రరావు శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు బతుకంతా దొంగ రాజకీయాలే. బాబు విచ్ఛిన్నకర కుట్రలను ఎదుర్కోవడానికి తెలంగాణ సమాజమంతా రెడీగా ఉందన్నారు. చంద్రబాబు తెలివైన దొంగ అని, తెలంగాణను పాడు చేయడానికి బాబు టీడీపీ ఆఫీసులో డెన్‌ను ఏర్పాటు చేశాడన్నారు. అవినీతితో అడ్డదిడ్డంగా సంపాదించిన ధనంతో తెలంగాణను నాశనం చేయడానికి కుట్ర చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కుట్రలను ఎలా విచ్ఛిన్నం చేయాలో టీఆర్‌ఎస్‌కు తెలుసునని అన్నారు. ఇక్కడ ఎలాంటి కుట్రలు చేయాలని చూసినా ఊరుకోమని, బాబును తరిమి కొడతామని గట్టు రామచంద్రరావు హెచ్చరించారు. ఇక్కడి నుంచి చంద్రబాబు డెన్‌ తీసేయకుంటే తర్వాత జరిగే పరిణామాలకు మాబాధ్యత లేదన్నారు. చంద్రబాబు భయంతో ఒక నోటీస్‌ పట్టుకొని తిరుగుతున్నాడని, బాబువిూద కేసు కొట్టేయాలని తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్రను కోరాలని అనడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు చేసిన మోసాలకు జీవిత ఖైదు విధించాలని, తప్పుడు ఆలోచనలతో తెలంగాణలో శిఖండి రాజకీయాలు చేస్తే చంద్రబాబుకు ప్రజలు దిమ్మతిరిగే సమాధానం చెప్తారన్నారు. చంద్రబాబు కుట్రలకు కాంగ్రెస్‌ బాధ్యత వహించాలని, కాంగ్రెస్‌లో చంద్రబాబు తన కోవర్టులను పెట్టుకుని రాజకీయం చేస్తున్నాడన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి సిగ్గులేకుండా చంద్రబాబు చుట్టూ తిరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబుకు జెండా, ఎజెండా లేదని, చంద్రగిరిలో కూడా చంద్రబాబు పార్టీ గెలువడన్నారు. చంద్రబాబువి విషపు చూపులు.. విషపు చేష్టలని మండిపడ్డారు. ఏపీ పోలీసులను చంద్రబాబు దొంగలుగా వాడుకుంటున్నారని, ఏబీ వెంకటేశ్వరరావు ఆంధ్రా బాబుకి బ్రోకర్‌గా మారాడన్నారు. వందల కోట్ల రూపాయాలు పోలీసుల ద్వారా తెలంగాణలో పంచే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. ఆంధ్రా
పోలీసుల్లో కూడా తెలంగాణ శ్రేయోభిలాషులు ఉన్నారని, ఆంధ్రా పోలీసులే కాదు.. ఆంధ్రా ప్రజలు కూడా మా శ్రేయస్సును కోరుకుంటున్నారని గట్టు అన్నారు. ఆంధ్రా ప్రజల్లో కూడా కేసీఆర్‌కు క్రేజ్‌ ఉందని, ఆంధప్రదేశ్‌ పోలీసులను ఇక్కడి నుంచి పంపించాలని గవర్నర్‌, డీజీపీ, ఈసీకి ఫిర్యాదు చేస్తామని గట్టు రామచంద్రరావు తెలిపారు.