– తెరాస సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడం ఖాయం
– తెరాసకు ఎందుకు అధికారం ఇవ్వకూడదో 100 ప్రశ్నలేస్తాం
-తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్
హైదరాబాద్, నవంబర్12(జనంసాక్షి) : ఏపీ సీఎం చంద్రబాబు లేఖలతో తెలంగాణలో ఏ ప్రాజెక్టు ఆగిందో హరీష్‌రావు చెప్పాలని పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి ప్రశ్నించారు. సోమవారం ఆయన తెదేపా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ చివరకు పార్టీ సమావేశం కూడా తన ఫామ్ హౌస్‌లోనే పెట్టారని.. తద్వారా ఫాంహౌస్ నుంచే పాలన చేస్తారని చెప్పకనే చెప్పారని అన్నారు. తెరాసకు అధికారం ఎందుకు ఇవ్వకూడదో హరీశ్‌రావుకు వంద ప్రశ్నలు వేస్తామన్నారు. చంద్రబాబు ఉత్తరాల వల్ల ఏ ప్రాజెక్టు ఆగిందో హరీశ్ రావు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలను కలుపుకొని పోతామంటూ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కేసీఆర్ కలుపుకొని పోయారని ఎద్దేవా చేశారు. కనీస ఉమ్మడి ప్రణాళికను మంగళవారం విడుదల చేసే అవకాశం ఉందని తెలిపారు. ఈ ప్రణాళికలో ప్రతి పౌరుడి సమస్యలనూ ప్రతిపాదించినట్టు చెప్పారు. కేసీఆర్ ఓట్ల కౌంటింగ్ కంటే ముందే నైతికంగా ఓడిపోయారన్నారు. చేసింది చెప్పుకొనే స్థాయిలో లేకపోవడం వల్లే అనవసరంగా చంద్రబాబును తిడుతున్నారని మండిపడ్డారు. అనంతరం తెదేపా సీనియర్ నేత పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. తెరాసను గద్దె దించేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. సింగిల్ డిజిట్‌కే తెరాస పరిమితం కానుందని జోస్యం చెప్పారు. అభ్యర్థుల ఎంపికలో తాము ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు చెప్పారు. మంగళవారం ఉదయం మహాకూటమి అభ్యర్థులను ఒకేసారి విడుదల చేస్తామన్నారు. కూటమి కనీస ఉమ్మడి ప్రణాళికతో పాటు అభ్యర్థులను కూడా ప్రకటించనున్నట్టు చెప్పారు.




