తిరుమల,ఏప్రిల్1 : ఈ నెల 4న చంద్రగ్రహణం పురస్కరించుకుని ప్రధాన ఆలయాలను మూసివేయనున్నారు. చందగ్రహణం కారణంగా ఈ నెల 4వ తేదీ స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో పెనుమాక పూర్ణచంద్రరావు తెలిపారు. శనివారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చందగ్రహణం కారణంగా శనివారం ఆలయంలో అన్ని ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నామని, ఆదివారం ఉదయం నుంచి యథావిధిగా ఆర్జిత సేవలు కొనసాగుతాయని తెలిపారు. ఆలయాన్ని శనివారం రాత్రి 8.30 గంటలకు తెరచి ఆలయ శుద్ధి, పుణ్యహవచనం, గ్రహణశాంతి, అభిషేకం నిర్వహించి, రాత్రి 9.30 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తామన్నారు. అలాగే శ్రీశైలం ఆలయాన్ని కూడా మూసివేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయాన్ని మూసేయాలని నిర్ణయించారు. చందగ్రహణం కారణంగా ఈ నెల 4వ తేదీ ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీశైల ఆలయాన్ని మూసివేయనున్నారు. అయితే ఏప్రిల్ నాలుగున ఏర్పడనున్న గ్రహణాన్ని పశ్చిమ ఉత్తర అమెరికా, ఆస్టేల్రియా, తూర్పు ఆసియా దేశాల్లోని ప్రజలకు వీక్షించే అవకాశం మాత్రమే దక్కుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. దేశ వ్యాప్తంగా ప్రజలకు దీన్ని చూసే అవకాశం కలుగుతుందని తెలిపారు. ఇక్కడ మధ్యాహ్నం 3:47 నిమిషాలకు గ్రహణం మొదలవుతుందని, 5:30కి పూర్తి స్థాయికి చేరుతుందని, రెండు నిమిషాల పాటు చంద్రుడు కనిపించడని పేర్కొన్నారు. సాయంత్రం 7:15కి ఇది పూర్తవుతుందని తెలిపారు. చంద్రుడు సాయంత్రం 6:32కి తూర్పున ఉదయిస్తాడు కనుక హైదరాబాద్ ప్రజలకు దీన్ని వీక్షించే అవకాశం దక్కకపోవచ్చని బి.ఎం.బిర్లా సైన్స్ సెంటర్ డైరెక్టర్ సిద్దార్ధ్ తెలిపారు.




