వరంగల్,ఫిబ్రవరి23(జనంసాక్షి): జిల్లాలో మిషన్ కాకతీయ కింది ఆయా చెరువుల పనులు ప్రారంభం కాగానే మట్టి తీసుకెళ్లేందుకు రైతులంతా సిద్ధంగా ఉండాలని అధికారులు సూచించారు. చెరువుల మట్టి నమూనాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. దశలవారీగా.. వచ్చే ఇరవైరోజుల్లో 650 చెరువుల మట్టి నమూనాలను సేకరించేందుకు ప్రణాళిక రూపొందించుకున్నట్లు వివరించారు. చెరువుల మట్టిలో పంటలకు కావాల్సిన పోషకాలు ఉన్నాయని వ్యవసాయాధికారులు చెప్పారు. జిల్లాలో మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చెరువుల పునరుద్ధరణ పనులు మార్చిలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే నీటిపారుదల శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటివరకు 70 చెరువులలోని మట్టి నమూనాలను భూసార కేంద్రానికి తీసుకొచ్చి పరీక్షలు చేశారు. వీటిలో 61 చెరువుల ఫలితాలు అనుకూలంగా రావడంతో వాటి మట్టిని రైతులు పంటపొలాల్లో వేసుకోవచ్చని భూసార పరీక్ష కేంద్రం అధికారులు తెలిపారు. జిల్లాలో మొదటి విడత పునరుద్ధరణ పనులకు ఎంపికచేసిన చెరువులలో పాలనాపరమైన అనుమతులు లభించినవాటికి సంబంధించి టెండర్ల పక్రియ చురుగ్గా సాగుతోంది. ఇప్పటికే 220 చెరువుల వరకు టెండర్ల పక్రియ పూర్తయింది. మిగితా చెరువుల టెండర్లు ఈనెల చివరివరకు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. టెండర్లు పూర్తయిన చోట పనులు ప్రారంభించనున్నందున వ్యవసాయ శాఖ భూసార పరీక్ష కేంద్రం అధికారులు చెరువులలోని మట్టి పరీక్షలు నిర్వహిస్తున్నారు.




