Tuesday, 3 November 2026

చైనా మనకు స్పూర్తి

C

– నిర్మాణ రంగంలో విప్పవాత్మక నిర్ణయాలు అవసరం

– సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,జనవరి 8(జనంసాక్షి):  ప్రస్తుతం సమయం త్యాగాల కోసం కాదని, దేశ నిర్మాణం కోసమని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. బిల్డర్లు అంటే కాంట్రాక్టర్లు మాత్రమే కాదని, వారు జాతి నిర్మాణంలో భాగస్వాములని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ అన్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహిస్తోన్న 27వ ఆలిండియా బిల్డర్స్‌ అసోసియేషన్‌ వేడుకల్లో

ఆయన మాట్లాడుతూ తెలుగు బిల్డర్లు దేశంలో,విదేశాలలో కూడా పలు నిర్మాణాలు చేపట్టి పేరు ,ప్రఖ్యాతులు సాధించారని ఆయన అన్నారు. ఆప్ఘనిస్తాన్‌ పార్లమెంటు భవనాన్ని శీనయ్య అండ్‌ కంపెనీ నిర్మించిందటే అది అందరికి గర్వ కారణమని కెసిఆర్‌ అన్నారు. బిల్డర్లను వర్కింగ్‌ ఏజేన్సీలుగా ప్రాధమిక వసతులు కల్పించే సంస్థలుగా పరిగణించాలని అదికారులకు చెప్పానని కెసిఆర్‌ అన్నారు. ఈ సందర్భంలో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందన్నారు. విప్లవాత్మక నిర్ణయాలతోనే ముందుకు సాగగలమని అన్నారు. దేశప్రధాని మోడీ ప్రగతి శీల వక్తి అని, సంస్కరణలకు ముందుంటున్నారని అని కెసిఆర్‌ మెచ్చుకున్నారు. రాష్ట్రాల్ర అభివృద్దిలోనే దేశం అబివృద్ది అని ప్రధాని అన్నారని, ఇప్పుడు టీమ్‌ ఇండియా గా పనిచేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రదాని మోడీ అధికారిక సమావేశాల తర్వాత , తమతో అనేక విషయాలు ముచ్చటిస్తుంటారని కూడా కెసిఆర్‌ మెచ్చుకున్నారు. ప్రణాళిక సంఘం స్థానే నీతిఆయోగ్‌ను తీసుకుని వచ్చి రాష్ట్రాల భాగస్వామ్యం పెంచారని అన్నారు. కరుడుగట్టిన కమ్యూనిస్టు దేశం చైనా.. క్యాపిటలిస్టుగా ఎలా మారింది ? మావో భావాల నుంచి పెట్టుబడిదారి దేశంగా ఎలా ఎదిగింది ? మనం కూడా అదే తీరుగా ఆలోచించాలి. పరిశ్రమలకు ఊతం ఇస్తేనే అభివృద్ధి సాధ్యం అవుతుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. తాను ఇటీవల చైనా వెళ్లిన సంగతిని గుర్తు చేస్తూ ఆ దేశం ఎలా ఆర్థికంగా ఎదిగిందన్న విషయాన్ని కేసీఆర్‌ తెలియజేశారు. పరిశ్రమలకు వీలైనన్ని అవకాశాలు కల్పిస్తేనే అభివృద్ధి జరుగుతుందని, కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని ఆయన కేంద్ర మంత్రి వెంకయ్యను కోరారు. దీని కోసం తెలంగాణ లాంటి రాష్ట్రాలకు పెద్ద పీఠ వేయాలన్నారు. అభివృద్ధి జరగాలంటే విప్లవాత్మక మార్పులు అవసరమని, దాన్ని తెలంగాణ ప్రభుత్వం గట్టిగా విశ్వసిస్తుందన్నారు. జాతి నిర్మాణ క్రమంలో మార్పులు అనివార్యమన్నారు. కాంట్రాక్టర్లను వర్కింగ్‌ ఏజెన్సీలుగా గుర్తించాలని కేసీఆర్‌ సూచించారు. దేశంలో వ్యవసాయం తర్వాత నిర్మాణ రంగమే అత్యధిక స్థాయిలో ఉపాధి కల్పిస్తోందని సీఎం అన్నారు. తెలంగాణ కాంట్రాక్టర్లకు దేశవిదేశాల్లో ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. భూసేకరణ చట్టంపైన కూడా సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం జారీ చేసిన భూసేకరణ చట్టం అర్థం కాని రీతిలో ఉందని, ఎలాగే అధికారంలోకి రాలేమని గుర్తించి దానిని గుదిబండ చేసి పోయారని అన్నారు. భూ సేకరణ లేకుండా అభివృద్ది ఎలా సాధ్యమని అన్నారు. గాలిలో మేడలు కట్టలేం కదా అని అన్నారు. అయితే నిర్వాసితుల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా భూసేకరణ జరగాలన్నారు.  ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం భూ సేకరణ చట్టంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కొత్త చట్టం వల్ల భూ సేకరణ ఇబ్బందిగా మారిందని, భూమిని సేకరించలేని స్థితిలో పారిశ్రావిూకరణ కుదరదన్నారు. తెలంగాణ రాష్ట్రం భూసేకరణ కోసం జీవో 123ను విడుదల చేసి భూమిని కొనుగోలు చేస్తోందన్నారు. రియల్‌ ఎస్టేట్స్‌ అభివృద్ధి చెందడానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టనుందని అన్నారు. నిర్మాణరంగానికి హైదరాబాద్‌ కేంద్రంగా మారుతోందన్నారు. రియల్‌ఎస్టేట్‌ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. నిర్మాణ రంగ సమస్యలను వెంకయ్యనాయుడు ప్రధాని దృష్టికి తీసుకెళ్తానన్నారని… మోదీ వాటిని తప్పక పరిష్కరిస్తారని కేసీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. రామోజీ సిటీ జ్యూయల్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ అని కూడా కెసిఆర్‌ ప్రశంసించారు. ఇంతమంచి సిటీ మరెక్కడా లేదన్నారు.

నిర్మాణరంగంలో బిల్డర్ల పాత్రే కీలకం

ఆధునిక, శక్తివంతమైన భారత్‌ నిర్మాణంలో బిల్డర్లు భాగస్వాములేనని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. వారితోనే దేశంలో నిర్మాణరంగం ముందుకు సాగుతోందన్నారు. వారి పాత్రను మరువలేమన్నారు. తాను నిర్మాణదారుల బృందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు తీసుకెళ్తానన్నారు. కేంద్రం చేపట్టిన మేక్‌ ఇన్‌ ఇండియా, స్వచ్ఛ్‌భారత్‌ స్వప్నం విజయవంతం కావాలని అన్నారు. అందుకు ప్రతి ఒక్కరూ చేయూతను ఇవ్వాలని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. వరల్డ్‌ బ్యాంక్‌, ఐఎంఎఫ్‌ లాంటి సంస్థలు కూడా భారత్‌ అభివృద్ధి పథంలో నడుస్తోందని చెబుతోన్న విషయాన్ని గుర్తు చేశారు. జిఎస్‌టీ, రియల్‌ ఎస్టేట్‌ బిల్లులను పార్లమెంట్‌లో పాస్‌ అయ్యేలా చూడాలని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీని కోరానని తెలిపారు. అన్ని రంగాల అభివృద్ధి జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో దేశంలో 10 వేల కిలోవిూటర్ల రహదారుల నిర్మాణం చేపట్టనున్నట్టు వెల్లడించారు. మౌలిక సదుపాయాల కల్పనలో తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ సమావేశంలో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు 12 వందల మంది నంబర్‌ వన్‌ కాంట్రాక్టర్లు, టర్కీ నిపుణులు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశం మూడు రోజులపాటు కొనసాగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *