Sunday, 8 November 2026

జగన్‌పై దాడిని ఖండిస్తే.. మాపై విమర్శలా?

– లోకేశ్‌ కూడా ఖండించాడు… జగన్‌, తెరాసతో ఆయన కలిసిపోయినట్టేనా?

– కాంగ్రెస్‌తో కలిసి ఎన్టీఆర్‌ ఆశయాలకు తూట్లు పొడిచాడు

– చంద్రబాబు కుల రాజకీయాలు ఇక్కడ చెల్లవు

– నాలుగేళ్లలో సెకండు కూడా కర్ఫ్యూ విధించలేదు

– అన్ని ప్రాంతాల ప్రజలు మావాళ్లుగా భావించాం

– ఏచిన్న సమస్య వచ్చినా పరిష్కరించాం

– రాహుల్‌ గాంధీ వీణ, బాబు ఫిడేల్‌ వాయించుకోవాల్సిందే

– కూకట్‌పల్లి సమావేశంలో ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, నవంబర్‌24(జ‌నంసాక్షి) : ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌పై దాడి జరిగితే స్పందించడం తప్పన్నట్లు చంద్రబాబు మాట్లాడటం సిగ్గుచేటని, సాటి మనిషిగా ఎవరిపైన దాడి జరిగినా స్పందించే మనస్తత్వం తెరాస నేతలదని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ అన్నారు. కూకట్‌పల్లిలో శనివారం నిర్వహించిన సీమాంధ్ర సంఘీభావ సభ ‘హమారా హైదరాబాద్‌’ కార్యక్రమంలో కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. ఏపీ కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో హైదరాబాద్‌లో ఎక్కడైనా పొరపాట్లు జరిగాయా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. తెరాస సర్కార్‌ హయాంలో హైదరాబాద్‌ మహానగరంలో కనీసం నాలుగు సెకెండ్లు కూడా కర్ఫ్యూ విధించలేదని గుర్తుచేశారు. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాతే 24గంటల విద్యుత్‌ అమలవుతోందన్నారు. కులం, మతం, ప్రాంతం పేరిట తెరాస రాజకీయం చేయలేదన్నారు. కేసీఆర్‌ను ఎదుర్కొనే సత్తా లేకే నాలుగు పార్టీలు జట్టుకట్టి వస్తున్నాయని కేటీఆర్‌ విమర్శించారు. తొమ్మిది ఏళ్లలో హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానంటున్న చంద్రబాబు నాలుగేళ్లలో అమరావతిని ఎందుకు అభివృద్ధి

చేయలేదని ప్రశ్నించారు. ఒక రాజకీయ నాయకుడిపై దాడి జరిగితే అందరూ స్పందిస్తారని, జగన్‌పై దాడి ఘటనపై స్పందించిన వారిని చంద్రబాబు తప్పు పట్టడం సరికాదని హితవు పలికారు. జగన్‌పై దాడి విషయంలో లోకేశ్‌ సైతం స్పందించారని.. అలాచూస్తే జగన్‌, మోదీ, తెరాసతో నారా లోకేశ్‌ కూడా కలిసిపోయినట్టేనా? అని ప్రశ్నించారు. హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతిచెందితే ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించామని, ఆయన అంత్యక్రియల్ని తమ ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించామన్నారు. దాన్ని కూడా తప్పుపడతారా అని కేటీఆర్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీని బంగాళాఖాతంలో కలపాలని టీడీపీని దివంగత ఎన్టీఆర్‌ స్థాపిస్తే.. చంద్రబాబు అదే టీడీపీని కాంగ్రెస్‌కు తోక పార్టీగా మార్చారని విమర్శించారు. దీంతో ఎన్టీఆర్‌ ఆత్మ ఘోషిస్తోందని, ఎన్టీఆర్‌ బతికున్నప్పుడు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఎన్టీఆర్‌ చనిపోయిన తర్వాత ఇప్పుడు మరోసారి వెన్నుపోటు పొడిచాడన్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌ ముందు చంద్రబాబు మోకరిల్లడంతో.. ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తోంది అని కేటీఆర్‌ పేర్కొన్నారు. కేసీఆర్‌ను ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము లేకనే కూటమి కట్టారని విమర్శించారు. ఒక్కరిని దించేందుకు నాలుగు పార్టీల నేతలు కలిసి వస్తున్నారని, కూటమికి ప్రతిపాదిక కూడా లేదన్నారు. డిసెంబర్‌ 11 తర్వాత రాహుల్‌ గాంధీ వీణ వాయించుకోవాలని, చంద్రబాబు ఫిడేల్‌ వాయించుకోవాలన్నారు. సింహం సింగిల్‌గానే వస్తుందని, దమ్ము లేని వారే గుంపులుగా వస్తారన్నారు. చంద్రబాబు నాయుడు ప్రతి విషయంలోనూ గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నాడని, తెలంగాణలో నివసించే ఆంధ్రా పౌరుల మధ్య చిచ్చు పెట్టాలని చంద్రబాబు తాపత్రయం పడుతున్నారు అని కేటీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణలో కులం, మతం, ప్రాంతం పేరిట రాజకీయాలు చేయడం లేదని, కానీ చంద్రబాబు ఆ విధంగా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా ప్రాంతీయ విబేధాలను రెచ్చగొట్టడానికి బాబు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలను విడగొట్టే భావన తమకు లేదని కేటీఆర్‌ స్పష్టం చేశారు.