– బాబు కనుసన్నల్లోనే శివాజి ‘ఆపరేషన్ గరుడ’ నాటకం
– ఆధారాలు దొరక్కుండా శివాజీ అమెరికా పారిపోయాడు
– సోమిరెడ్డి.. ఒక సోంబేరి రెడ్డిలా తయారయ్యాడు
– కేసు సరైన దారిలో విచారణ జరగడం లేదు
– విలేకరుల సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా
– తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
తిరుమల, అక్టోబర్30(జనంసాక్షి) : ప్రతిపక్ష నేత జగన్‌పై జరిగిన దాడి ఘటన తెదేపా కుట్రేనని వైకాపా ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారిని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రోజా మంగళవారం దర్శించుకున్నారు. అనంతరం రోజా విలేకరులతో మాట్లాడుతూ.. దాడికి పాల్పడిన శ్రీనివాస్ కోటి రూపాయలతో భూమి కొనుగోలు చేసేందుకు బేరసారాలు ఆడాడని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి తెదేపా నేతలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. చంద్రబాబు, సినీ నటుడు శివాజీ కలిసి ఆపరేషన్ గరుడ పేరుతో జగన్‌ను చంపడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఈ కేసులో ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు, ప్లాన్‌లో భాగంగానే శివాజీ అమెరికా పారిపోయారని వ్యాఖ్యానించారు. గతంలో చంద్రబాబు కేబినేట్ సమావేశంలో శివాజీ పాల్గొన్నారని వార్తలు కూడా వచ్చాయని చెప్పారు. టీడీపీతో సంబంధం లేకపోతే అతన్ని ఇంతవరకూ అరెస్ట్ చేయడానికి ఎందుకు ప్రయత్నించలేదని అనుమానం వ్యక్తం చేశారు. ప్రజలకి, ప్రతిపక్షాలకి రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడిపై హత్యాయత్నం జరిగితే అది ఒట్టి డ్రామా అని సీఎం చంద్రబాబు కొట్టి పారేయడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్‌పై జరిగింది హత్యాయత్నం అని రిమాండ్ రిపోర్ట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు, మరి ఇప్పుడు ఏమంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. క్రిమినల్ కేసులున్న శ్రీనివాస్‌కి ఎన్‌వోసీ తీసుకుని ఎందుకు తన వద్ద పెట్టుకున్నాడో హర్షవర్దన్ చౌదరి చెప్పాలని రోజా డిమాండ్ చేశారు. జగన్‌పై హత్యాయత్నం జరిగితే ఆ కోణంలో దర్యాప్తు చేయకుండా కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. కేసు సరైన మార్గంలో విచారణ సాగటం లేదు కనుకనే వైఎస్సార్‌సీపీ ఎంపీలు కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయాలని కేంద్రాన్ని కోరారని తెలిపారు. సోమిరెడ్డి ఒక సోంబేరి రెడ్డిలా తయారయ్యారని, ఐదుసార్లు ఓడిపోయినా, నెల్లూరు ప్రజలు ఛీకొట్టినా మంత్రి పదవి కట్టబెట్టి చంద్రబాబు వెర్రికూతలు కూయిస్తున్నారని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. జగన్‌పై హత్యాయత్నం కేసుకు సంబంధించి టీడీపీ నేతలు రౌడీల్లాగా, గూండాల్లాగా దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం, మంత్రులు దిగజారుడు మాటలు ఆపి, ఇకనైనా బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు. కేసులో కీలక నిందితుడైన శివాజీని అరెస్ట్ చేయకుండా, జగన్ కుటుంబ సభ్యులపై నిందలు వేయడం బాధాకరమన్నారు. వారి మాటలు వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్‌పై దాడి జరిగిన గంటలోనే నిందితుడు జగన్ అభిమాని అని డీజీపీ చెప్పడం, ఫ్లెక్సీని విడుదల చేయడం వెనుక కుట్ర ఉన్నట్లు తెలుస్తోందని రోజా అన్నారు..
జగన్‌పై దాడి తెదేపా కుట్రే




