Tuesday, 3 November 2026

జగన్‌ కేసును..  థర్డ్‌ పార్టీతో విచారణ జరిపించాలి

– కుట్ర వెలుగులోకి రాకుండా ప్రభుత్వం నీరుగార్చేందుకు యత్నిస్తుంది
– గవర్నర్‌ నర్సింహన్‌ను కలిసిన వైసీపీ నేతలు
– 15నిమిషాల పాటు గవర్నర్‌తో భేటీ
– చంద్రబాబు, డీజీపీ ఠాకూర్‌ పై ఫిర్యాదు!
– కుట్ర కోణంలో సిట్‌ దర్యాప్తు జరగడం లేదని వెల్లడి
హైదరాబాద్‌, నవంబర్‌1(జ‌నంసాక్షి) : జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన దాడిని తెదేపా ప్రభుత్వం చిన్నదిగా చేసి చూపేందుకు కుట్రలు చేస్తుందని, సిట్‌ దర్యాప్తుతో కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతుందని వైసీపీ నేతలు తెలిపారు. ఈమేరకు గురువారం తెలుగురాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ను కలిసిన వైసీపీ నేతలు విశాఖఎయిర్‌పోర్ట్‌లో తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన దాడి గురించిన ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా గవర్నర్‌ కి వైఎస్‌ జగన్‌ రాసిన లేఖను ఆయనకు అందజేశారు. గవర్నర్‌తో 15నిమిషాల పాటు వైసీపీ నేతల సమావేశం జరిగింది. గవర్నర్‌ను కలిసిన వారిల్లో ధర్మాన ప్రసాద్‌ రావు, కాకాణి గోవర్ధన్‌, కంతేటి సత్యనారాయణ రాజు, మోపిదేవి వెంకటరమణ, పిన్నెల్లి, ఇక్బాల్‌, అనంత వెంకట రామి రెడ్డి, రోజా, కోన రఘుపతి, ఆది మూలపు సురేష్‌ తదితరులున్నారు.   అనంతరం ధర్మాన ప్రసాద్‌రావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. జగన్‌ పై హత్యాయత్నం ఘటనపై డీజీపీకి గవర్నర్‌ ఫోన్‌ చేయగానే ముఖ్యమంత్రి దారుణంగా స్పందించారని విమర్శించారు. అసలు గవర్నర్‌ డీజీపీకి ఫోన్‌ చేయరాదని ఓ వితండవాదాన్ని అందుకున్నారని వెల్లడించారు. గవర్నర్‌ నియమించాకే ప్రభుత్వం, సీఎం ఉనికిలోకి వస్తారనీ, ఈ విషయాన్ని మర్చిపోయిన టీడీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. జగన్‌పై దాడి జరిగిన తర్వాత చోటుచేసుకున్న ఘటనలను గవర్నర్‌ నరసింహన్‌ కు వివరించినట్లు పేర్కొన్నారు. జగన్‌ ను కైమా.. కైమా చేసేవాళ్లమని ఓ టీడీపీ నేత హెచ్చరించారనీ, ఇలాంటి దారుణ పరిస్థితి ఆంధప్రదేశ్‌ లో నెలకొని ఉందని ఆయన వ్యాఖ్యానించారు. జగన్‌ పై హత్యాయత్నం వెనుక ఎవరున్నారో తెలుసుకునే హక్కు రాష్ట్ర ప్రజలకు ఉందని స్పష్టం చేశారు. ఇప్పుడు సిట్‌ జరుపుతున్న విచారణ తప్పుదోవ పడుతోందని
ఆరోపించారు. అందువల్లే తాజాగా గవర్నర్‌ ను కలిసి సీఎం చంద్రబాబు, డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ పై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇలాంటి సందర్భంలో రాష్ట్రానికి సంబంధం లేని సంస్థతో విచారణ జరిపించాలని తాము గవర్నర్‌ ను కోరినట్లు వెల్లడించారు. అసలు గవర్నర్‌ డీజీపీకి ఎలా ఫోన్‌ చేస్తారని చంద్రబాబు ప్రశ్నించడంపై స్పందిస్తూ.. గవర్నర్‌ రాష్ట్రానికి రాజ్యాంగాధిపతి అని పేర్కొన్నారు. గవర్నర్‌ తానంతట తానుగా నిర్ణయాలు తీసుకోలేరనీ, అయితే చట్టాలు, నిబంధనల ఉల్లంఘన జరిగితే ఆయన జోక్యం చేసుకుని నివేదిక కోరవచ్చని తెలిపారు. ఈ చిన్న విషయం కూడా సీఎం చంద్రబాబుకు తెలియకపోవడం మా ఖర్మ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.