జగన్ ఘటనపై … తెదేపా నేతల వ్యాఖ్యలు సరికాదు
– ఘటనపై సమగ్ర విచారణ జరపాలి
– ఏపీ సీపీఐ కార్యదర్శి కె.రామకృష్ణ
అనంతపురం, అక్టోబర్29(జనంసాక్షి) : ఏపీ ప్రతిపక్షనేత వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి హత్యాయత్నం ఘటనపై తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎంపీలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సంస్కారం కాదని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు మంచి పద్ధతి కాదని సీపీఐ ఏపీ కార్యదర్శి కే రామకృష్ణ హితవు పలికారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ప్రతిపక్ష నేతపై ఇలాంటి దాడి జరుగుతుందని ఊహించలేదని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు తీరు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. జగన్‌పై దాడి జరిగిన ఐదు గంటల తర్వాత ముఖ్యమంత్రి మంత్రి స్పందించటం సరికాదన్నారు. విూడియా సమావేశంలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సభ్యత కాదని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి ఎంతో, ప్రతిపక్ష నేత కూడా అంతేనని చెప్పారు. సీఎం చంద్రబాబు.. వైఎస్ జగన్‌ను ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. కనీసం ఫోన్లో పరామర్శించే తీరిక చంద్రబాబుకు లేదా అని అడిగారు. జగన్‌పై హత్యాయత్నం ఘటనపై సమగ్ర విచారణ జరగాలని కోరారు. ఏపీ ప్రభుత్వంపై నమ్మకం లేదని వైసీపీ అంటోందని, విశాఖ ఎయిర్ పోర్ట్ ఘటనపై తక్షణమే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలన్నారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేయాలని, జగన్‌పై దాడి చేసిన వారందరినీ కఠినంగా శిక్షించాలని రామకృష్ణ అన్నారు. వైఎస్ జగన్ హత్యాయత్నం వెనుక ఎవరున్నారో నిగ్గుతేల్చాలన్నారు. సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు వైఎస్ జగన్ హత్యాయత్నం కేసులో ఎందుకు అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు.