జగన్ పాదయాత్రకు ప్రజాదరణ పెరుగుతుంది
– ప్రభుత్వం తీరుకు నిరసనగా 16న కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు
– చంద్రబాబుకు మత్స్యకారుల ఇబ్బందులు పట్టవా..?
– ప్రజా సమస్యలపై ఎవరిపోరాడినా సంతోషమే
– వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి
విశాఖపట్నం, మే14(జనం సాక్షి) : జననేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు జల్లా జిల్లాకు ప్రజాదరణ పెరుగుతోందని వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయి రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలను తెలుసుకుని, వాటిని పరిష్కరిస్తూ, సుపరిపాలన అందించాలనే ఉద్దేశంతోనే వైఎస్ జగన్ ఈ యాత్ర చేపట్టారని ఆయన పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్రకు మద్దతుగా విశాఖలో సంఘీభావ యాత్ర చేపట్టిన విజయసాయి రెడ్డి సోమవారం పలు ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 16న అన్ని జిల్లాల కలక్టరేట్ల వద్ద ఆందోళనలు, ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. సంఘీభావ యాత్రలో నాలుగు సంవత్సరాల తెలుగుదేశం పాలనా వైఫల్యాలు ప్రతిబింబిస్తున్నాయన్న ఆయన.. ఎన్నికలు ఎంత తొందరగా వస్తే, అంత త్వరగా టీడీపీకి బుద్ధి చెప్పాలనే ఆకాంక్ష ప్రజల్లో కన్పిస్తోందంటూ వ్యాఖ్యానించారు.
మత్స్యకారుల ఇబ్బందులు పట్టవా..?
విశాఖ దక్షిణ నియోజక వర్గ శాసనసభ్యుడు వాసుపల్లి గణెళిష్ కుమార్ భూకబ్జాలు, ధనార్జనే ధ్యేయంగా ప్రజాకంటక సభ్యుడిగా నిలిచిపోయారని మండిపడ్డారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రేషన్ సరుకులు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా మత్స్యకారులకు నెలానెలా రావాల్సిన నాలుగు వేల రూపాయల భృతిని ఇవ్వకుండా వారిని ఇబ్బందుకు
గురిచేస్తున్నారని మండిపడ్డారు. అదేవిధంగా ఫిషింగ్ హార్బర్‌ను పోర్ట్ ఆధిపత్యం నుంచి స్వాధీనం చేసుకుని, మత్స్యకార సంఘాలకు అప్పగిస్తామన్న ప్రభుత్వ హావిూ నెరవేరకపోగా, విశాఖ కంటైనర్ టెర్మినల్ ఆక్రమించుకుంటోందని విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో జన్మభూమి కార్యక్రమం కోసం విశాఖ వచ్చిన సీఎం చంద్రబాబు మత్స్యకారుల సమస్యలను పట్టించుకోకుండా అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణెళిష్ కుమార్‌తో కలిసి వినతి పత్రం అందివ్వడానికి వచ్చిన మత్స్యకార సంఘాల నేతలను తోలు తీస్తానంటూ చంద్రబాబు బెదిరించడం.. మత్స్యకారుల పట్ల ఆయనకున్న వైఖరిని తెలియజేస్తుందంటూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ నిర్వహించతలపెట్టిన బస్సు యాత్రపై విజయసాయిరెడ్డి స్పందించారు. ప్రజాసమస్యలపై ఎవరు పోరాడినా సంతోషమేనన్నారు. అలాగే ప్రజాసమస్యలపై ఎవరు పరిష్కారం చూపినా అభినందించాల్సిందేనని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు.