Wednesday, 4 November 2026

జగన్‌ పాదయాత్రలో తేనెటీగల దాడి

తేనెతుట్టను కదిలించిన ఆకతాయిలు..
10 మందికి పైగా గాయాలు
జగన్‌ను పక్కకు తప్పించిన రక్షణ సిబ్బంది
ఏలూరు,జూన్‌7(జ‌నం సాక్షి) : పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్న వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ పాదయాత్రపై గురువారం తేనెటీగలు దాడి చేశాయి. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా పెరవలి మండలం కానూరు శివారు కొండాలమ్మ గుడి వద్ద జగన్‌ పాదయాత్ర చేస్తుండగా తేనెటీగలు ఒక్కసారిగా మూకుమ్మడి దాడి చేశాయి. తేనెటీగల దాడి నుంచి జగన్‌ను కాపాడేందుకు భద్రతా సిబ్బంది విశ్వప్రయత్నాలు చేశారు. తేనెటీగల బారిన పడకుండా కొద్దిసేపు జగన్‌ను పక్కకు తీసుకెళ్లారు. తేనెటీగలు పాదయాత్ర పొడవునా వందవిూటర్లకుపైగా వచ్చి దాడిచేయటంతో వాటి నుంచి కాపాడుకోవటానికి యాత్రలో పాల్గొన్నవారు అష్టకష్టాలు పడ్డారు. రక్షకులు సైతం తాము ధరించిన టీషర్టులను తలవిూదుగా తీసుకుని రక్షించుకోవడంతో పాటు టోపీలు, రుమాళ్లను వినియోగించి తరిమి కొట్టే ప్రయత్నం చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు పాదయాత్ర జరుగుతున్న సమయంలో తేనెతుట్టపై రాయి విసరటంతో తేనెటీగలు ఒక్కసారిగా దాడిచేశాయి. తేనెటీగల దాడిలో సుమారు పదిమంది వరకు గాయపడ్డారు. జగన్‌ బుధవారం రాత్రి బస చేసిన నడుపల్లి కోట నుంచి కానూరు శివారు విూదుగా నిడదవోలు మండలం మునిపల్లి గ్రామ పొలిమేరల వరకు ఈరోజు పాదయాత్ర కొనసాగించనున్నారు.. అక్కడితో యాత్ర ముగించుకుని మధ్యాహ్నం హైదరాబాదు వెళ్లనున్నారు. తిరిగి శనివారం యాత్ర యధావిధిగా కొనసాగనుంది.