Wednesday, 4 November 2026

రైతు మాటే మనకు దీవెన

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోషనల్‌ ఇంజనీర్‌
వ్యవసాయంపై మంచి అవగాహన ఉంది
సమిష్టి కృషితో విజయవంతంగా నీటిసరఫరా చేయగలిగాం
ఒక్క ధర్నా లేకుండా 13.50లక్షల ఎకరాలకు నీరందించాం
పంటల సాగు పూర్తయినా నీరొస్తున్నాయని అంటున్నారు
మహిళా ఇంజినీర్లు పనితీరు అద్భుతం
రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు
హైదరాబాద్‌, జూన్‌7(జ‌నం సాక్షి) : రైతుమాటే తెలంగాణ ప్రభుత్వం బాట, వారు సంతోషంగా ఉండేందుకు కేసీఆర్‌ అద్భుతమైన పథకాలతో ప్రజల్లోకి వెళుతున్నారని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. ఖైరతాబాద్‌లోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ కార్యాలయంలో నాలుగేళ్ల ప్రగతి-ప్రాజెక్టులో సాగునీటి నిర్వహణపై రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్‌ ఎస్‌కే జోషీ, నాగార్జునసాగర్‌, నిజాంసాగర్‌, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులకు చెందిన ఇంజినీర్లు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన హారీష్‌రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోషనల్‌ ఇంజినీర్‌ అని,  సీఎం కేసీఆర్‌కు వ్యవసాయంపై మంచి అవగాహన ఉందన్నారు. ఇంజినీర్లు, నీటి పారుదల శాఖ అధికారులు మంచి పనీతీరు కనబరుస్తున్నారని ప్రశంసల వర్షం కురిపించారు. సమిష్టి కృషితో విజయవంతంగా నీటిసరఫరా చేయగలిగామని, ఈ ఏడాది నాగార్జునసాగర్‌ కింద 5 లక్షల 25వేల ఎకరాలకు సాగునీరందించామన్నారు. రైతు మాటే మనకు దీవెన అని, పంట కోసిన తరువాత కూడా మాకు నీరు అందుతుందని రైతులు చెబుతున్నారు. రైతు వెంకట్‌రెడ్డి మాటలు నీటి పారుదలశాఖ పనితీరుకు నిదర్శనమన్నారు. నీటి నిర్వహణ ఈసారి పకడ్బందీగా అమలు చేశామని హరీష్‌రావు తెలిపారు. సాగర్‌ ద్వారా ఒక్కొక్క టీఎంసీకి 11వేల 796 ఎకరాలు పారిస్తున్నామని, అధికారుల సమిష్టి కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఎస్సారెస్పీ కింద 6లక్షల 50వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చామని, టేల్‌ టు హెడ్‌ విధానం ద్వారా కూడా నీళ్లు రాని గ్రామాలకు కూడా నీళ్లిచ్చామన్నారు. మహిళా ఇంజినీర్లు కూడా ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నారని హరీష్‌రావు కొనియాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తరువాత కొత్తగా 650మంది ఇంజినీర్లు వచ్చారన్నారు. వాళ్లకు సీనియర్లు మార్గనిర్దేశం చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోషనల్‌ ఇంజినీర్‌ అని, సీఎం కేసీఆర్‌కు వ్యవసాయంపై మంచి అవగాహన ఉందని హరీష్‌ రావు అన్నారు. అందుకే ప్రాజెక్టులకు రీడిజైనింగ్‌ చేశారు. నాలుగేళ్ల సమిష్టి కృషితోనే అద్భుత ఫలితాలు. ఆన్‌, ఆఫ్‌ పద్ధతిలో నీటి విడుదలతో పంట దిగుబడి పెరిగినట్టు రైతులు చెబుతున్నారని పేర్కొన్నారు. ప్రాజెక్టుల కింద చుక్కనీరు వృథా కాకుండా చూస్తున్నామని, చివరి ఆయకట్టు వరకు నీరు అందించడమే లక్ష్యమన్నారు. ధర్నాలు, రాస్తారోకోలు లేకుండా 13లక్షల 50వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చామని, నీళ్లు ఎక్కడ ఉంటే ప్రగతి అక్కడే ఉంటుందన్నారు. ఈ ఏడాదిలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో 24లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందిందని, 60ఏండ్లలో సాధించనిది కేవలం ఐదేండ్లలో సాధిస్తున్నామని హరీష్‌రావు పేర్కొన్నారు. మిషన్‌ కాకతీయ అద్భుతమైన పథకమని, దేశవ్యాప్తంగా మిషన్‌ కాకతీయకు ప్రశంసలు వచ్చాయన్నారు. మిషన్‌ కాకతీయ ద్వారా 12లక్షల ఎకరాలు స్థిరీకరణ చేశాం. భూగర్భ జలాలు కూడా పెరిగాయని హరీష్‌రావు పేర్కొన్నారు. ఈ పథకాన్ని ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నాయన్నారు.