
– సెజ్ ల పేరుతో అడ్డగోలుగా భూదోపిడీ చేస్తున్నారు
కాకినాడ, నవంబర్6(జనంసాక్షి) : రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ముందుగా చేసే పని ఎస్‌ఈజెడ్ రైతులపై ఉన్న కేసులను ఎత్తివేస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కాకినాడలోని మంగళవారం జీ కన్వెన్షన్ సెంటర్ లో ఎస్‌ఈజెడ్ నిర్వాసితులు, రైతులతో పవన్ భేటీ అయ్యారు. ఈసందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. రైతులు దొంగల్లాగ జైలుకెళ్లడమేంటని ప్రశ్నించారు. అసలైన దొంగలు, దేశాన్ని దోచేసిన దొంగలు విదేశాల్లో దర్జాగా తిరుగుతున్నారన్నారు. స్పెషల ప్లైట్లు, లగ్జరీ రూమ్ లలో ఎంజాయ్ చేస్తున్నారన్నారు. సాధ్యమైనంత మేరకు రైతులకు అండగా ఉంటానని, రైతులపై కేసుల్లేకుండా చేస్తానన్నారు. రైతులపై ఉన్న కేసులను తీయించే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. చట్టపరమైన ఇబ్బందులేమున్నా వాటిని ఎలా అధిగమించాలనేది ఖచ్చితంగా చేస్తానన్నారు. సెజ్ ల పేరుతో అడ్డగోలుగా భూదోపిడీ చేస్తున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. రైతుల వద్ద భూమి తీసుకున్నా పరిశ్రమలు ఏమైనా స్థాపించారా అంటే అదీ లేదన్నారు. రైతుల నుంచి భూమి లాక్కొని వారు సొమ్ము చేసుకుంటున్నారన్నారు. వేల కోట్లు సంపాదించి ఏం చేస్తారని ప్రశ్నించారు. దోపిడీలు, భూకబ్జాలు చేసేదేమో వారు.. ప్రశ్నిస్తే తీవ్రవాదిగా ముద్ర వేస్తారన్నారు. అడ్డగోలుగా మైనింగ్ చేస్తున్నారని ఆయన అన్నారు. అధికారంలోకి రాక ముందు చెప్పేదొకటి, అధికారం వచ్చాక మరొకటి చేస్తారన్నారు.
పాలకులు ప్రభువులు ప్రజలకు తల్లిదండ్రులుగా వ్యవహరించాలని పవన్ కల్యాణ్ అన్నారు. సమస్యలు పరిష్కారం కావాలంటే పాలకులను చొక్కాపట్టుకొని నిలదీస్తే తప్ప పరిష్కారం దొరకడం లేదన్నారు. శాంతిని నెలకొల్పడానికి కూడా కత్తి అండగా కావాల్సిన రోజులు ఇవాళ ఉన్నాయన్నారు. ప్రకృతినే విధ్వంసం చేస్తుండడంతో ప్రజలు రాజకీయ నాయకులంటేనే భయాందోళనకు గురయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. భూములు తీసుకున్న రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు. పరిశ్రమల పేరుతో వేలఎకరాల భూములను రైతుల నుంచి లాక్కొని పరిశ్రమలు పెట్టరు.. ఉద్యోగాలు ఇవ్వరని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి భూమి అని రైతుల నుంచి లాక్కుంటారని ప్రశ్నించారు. ఎవడబ్బ సొమ్మని రైతుల భూములను లాక్కుంటున్నారని పవన్ అడిగారు. పరిశ్రమలు పెట్టడానికి అవసరమైన భూమి కంటే ఎక్కువే తీసుకుంటారన్నారు. కానీ ఆ నిర్వాసితులను పట్టించుకోరని, వారిని పరిహారం ఇవ్వరని అన్నారు. కేవీ రావు అనే వ్యక్తి ఎవరని ఆయన ప్రశ్నించారు. విూకు భూములు తీసుకునే హక్కు ఎక్కడిదని అడిగారు.
జనసేన అధికారంలోకి వస్తే.. రైతులపై కేసులను ఎత్తివేస్తా




