
సుప్రీంకోర్టులో అప్పీలుకు కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం
ఆదాయానికి మించి ఆస్తులు 10 శాతాన్ని అనుమతి ఇస్తూ గతంలో జీవోలు జారీ అయ్యాయి. దానికి తగ్గట్టుగానే జయలలిత ఆదాయం 10 శాతం మాత్రమే అధికంగా ఉందని ఇది ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కిందకు రాదని కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పులో చాలా తప్పులు దొర్లాయని, ఆ తప్పులను ఎత్తిచూపుతూ ఖచ్చితంగా సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని గతంలో కర్నాటక ప్రభుత్వం చెప్పిందని, దీనిపై కొన్ని రోజులు తర్జనభర్జన పడిన అనంతరం చివరికి సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకుంది.
జయ అక్రమాస్తుల కేసులో మొదటి పిటిషనర్ సుబ్రహ్మణ్యసామి కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కర్నాటక హైకోర్టు జయలలితను నిర్దోషిగా ప్రకటించడం ఆమోదయోగ్యం కాదని ఆయన అన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా కర్నాటక ప్రభుత్వమే సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సోమవారం నిర్ణయం తీసుకోవడంతో ఈ కేసు మళ్లీ మొదటికి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న కేసులో అన్నాడిఎంకే అధినేత్రి జయలలితను కర్నాటక హైకోర్టు ఇటీవల నిర్దోషిగా ప్రకటించిన విషయం తెలిసిందే. జయ అక్రమాస్తుల వ్యవహారాన్ని తొలుత బయట పెట్టిన నేత సుబ్రహ్మణ్యస్వామి. కర్నాటక హైకోర్టు జయలలితను నిర్దోషిగా ప్రకటించడంపై స్వామి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు తీర్పులో అనేక లొసుగులు ఉన్నాయని, అందుకే జయ తప్పించుకోగలిగారని ఆయన అన్నారు.




