మన నీటిని మనకు దక్కకుండా చేసిన సమైక్య కుట్రలకు రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టనుంది. దీనిలో భాగంగా ప్రాజెక్ట్ ల రీడిజైనింగ్‌కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఖమ్మం జిల్లాలో గోదావరిపై రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్లకు కొత్తరూపు రానుంది. రెండు జలశయాల విస్తరణ సామర్థ్యం పెంచుతూ…ఆయకట్టును విస్తరించనున్నారు. అందుకోసం అధికారులు ప్రణాళికలను సిద్దం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాజీవ్‌సాగర్‌ను రీడిజైన్ చేస్తూ… దుమ్ముగూడెం, బయ్యారం ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. దీనితో పాటు ఇందిరాసాగర్‌ను వినియోగంలోకి తెచ్చేలా మార్పు చేశారు. దీంతో రెండు ప్రాజెక్ట్ ల కింద మరో లక్ష ఎకరాల ఆయకట్టు పెరగనుంది. అలాగే భవిష్యత్తులో సాకారం అయ్యే బయ్యారం ఉక్కు పరిశ్రమ నీటి అవసరాలను తీర్చేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. అందుకోసం మరో 9వేల కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.
రాజీవ్ సాగర్ గత డిజైన్‌లో నీటి విడుదల సామర్థ్యం 1800 క్యూసెక్కులు ఉంటే.. కొత్త డిజైన్‌లో 2500 క్యూసెక్కులకు పెంచారు. దుమ్ముగూడెం నుంచి నారెళ్లపాడు, కరకవాగు వరకు గ్రావిటీ ద్వారా నీటిని తరలించి అక్కడి నుంచి ఎత్తిపోతల ద్వారా రోళ్లపాడు, బయ్యారం, పాలేరుకు నీటిని తరలించాలనేది కొత్త డిజైన్. పాలేరు నుంచి మరిపెడకు సాగునీరు అందించేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ క్రమంలో 115 కిలోమీటర్ల మేర కాలువ, పైప్‌లైన్ మార్గాన్ని నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. అలాగే నారెళ్లపాడు దగ్గర 3 నుంచి 4 టీఎంసీలు, రోళ్లపాడు దగ్గర 15 టీఎంసీలు, బయ్యారం దగ్గర 4టీఎంసీలు, పాలేరు వద్ద 2.5 టీఎంసీల నీటి నిల్వ ఉండే రిజర్వాయర్లను నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. ఇందుకోసం 7వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అంచనా వేశారు.
ఇందిరాసాగర్ ప్రాజెక్ట్ నీటిని ఆర్వపల్లి నుంచి తరలించేలా తాజా డిజైన్ రూపొందించారు. దీనికి 2వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఈ మేరకు కొత్తగా రూపొందించిన డిజైన్‌ను ప్రభుత్వానికి అందించనున్నారు.




