Monday, 2 November 2026

జాతిని ఐక్యం చేసే మహత్తర శక్తి రాజ్యాంగానికి ఉంది

C

– వందేళ్ల దూరదృష్టి అంబేడ్కర్‌

– దేశం సెక్యులర్‌గానే ఉంటుంది

– రాజ్యాంగంపై ముగిసిన రెండు రోజుల చర్చ

న్యూఢిల్లీ,నవంబర్‌27(జనంసాక్షి):

జాతి మొత్తాన్ని ఏకతాటిపై నిలిపే శక్తి రాజ్యాంగానికే ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాజ్యాంగంపై నిర్వహించిన చర్చ సందర్భంగా లోక్‌సభలో ఆయన ప్రసంగిస్తూ  రాజ్యాంగం అనేది ఒక సాధారణ పదం కాదని, భారతీయుల గౌరవానికి ప్రతీక, ఐక్యతకు నిదర్శనమన్నారు. సుదీర్ఘ ప్రసంగంలో ఆయన ఈ దేశానికి ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఎలా కృషి చేశారో వివరించారు. అలాగే సంస్కృత సూక్తులతో భారత్‌ ఔన్నత్యాన్ని వివరించారు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ అన్న రామాయాణ సూక్తితో తన ప్రసంగాన్ని ముగించారు. భారత రాజ్యాంగంపై చర్చించేందుకు సభ్యులందరూ ఆసక్తి ప్రదర్శించారన్నారు. ఈ చర్చలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. భారత అభివృద్ధిలో ప్రతి ప్రధాని పాత్ర ఉందని తాను ఎర్రకోటలోనే చెప్పానని గుర్తుచేశారు. అన్ని ప్రభుత్వాలు దేశాభివృద్ధికి కృషి చేశాయన్నారు. రాజ్యాంగం రూపకల్పనలో మహనీయుల దూరదృష్టిపై సభలో చర్చించినట్లు చెప్పారు. రాజ్యాంగంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ చర్చకు కృషిచేసిన స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భారత్‌లో సమస్యలు లేవని కాదు. సమస్యలు లేని కాలం ఎప్పుడూ లేదు. అయితే సమస్యలు, సవాళ్లు తలెత్తినప్పుడల్లా వాటిని పరిష్కరించగలిగే సత్తాగల మహనీయులు కూడా దేశంలో పుట్టుకొచ్చారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అంటరానితనం, సతీసహగమనం లాంటి సమస్యలు తలెత్తినప్పుడు ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌, జ్యోతిరావ్‌ పులే లాంటి మహనీయులు పుట్టారని చెప్పారు. అవినీతి పరాకాష్టకు చేరినప్పుడు లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ లాంటి నేతలు పుట్టుకొచ్చారన్నారు. దేశంలో ఎప్పుడు సమస్యలు తలెత్తినా పరిష్కరించేందుకు మహనీయులు పుట్టుకొచ్చే అంతర్గత వ్యవస్థ భారత్‌లో ఉందని మోదీ చెప్పారు. అయితే  రాజకీయ నేతలపై ప్రజల్లో విశ్వసనీయత తగ్గుతోంది. దాన్ని తిరిగి సాధించుకోవడమే మనముందున్న ప్రధాన సవాల్‌ అన్నారు.  రాజ్యాంగపై ప్రజల్లో ఆసక్తి కల్పించేందుకు ఆన్‌లైన్‌ పోటీలు నిర్వహించాలని,  మన బాధ్యతలు మనం తెలుసుకున్నప్పుడే న్యాయ పాలన సాధ్యమవుతుందన్నారు.   ప్రజాస్వామ్యంలో ఏకాభిప్రాయం గొప్ప బలాన్నిస్తుందని,  రాజ్యాంగంలోని ప్రతి పుటలో అంబేడ్కర్‌ గొప్పతనం కన్పిస్తుందన్నారు.  అంబేడ్కర్‌ ఆలోచనలు, బోధనలు అన్ని తరాలకు అనుసరణీయం అంటూ  రాజ్యాంగాన్ని ఒక దస్త్రంగా చూస్తే ప్రజాస్వామ్యానికి ఇబ్బంది. రాజ్యాంగం మూలాల్లోకి వెళ్లి అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. ఓ వందేళ్ల ముందే అంబేడ్కర్‌ ఇవి ఊహించి రాశాడన్నారు.  అంబేడ్కర్‌ తన జీవితంలో ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాజ్యాంగ రూపకల్పనలో ఎక్కడా వాటిని ప్రతిబింబించలేదన్నారు.  సంఖ్యా బలం పాలనకన్నా ఏకాభిప్రాయానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.  వంద ఏళ్ల తర్వాత కూడా ప్రపంచం ఎలా ఉండబోతుందో ఊహించి మహనీయుడు అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని రచించారని అన్నారు. భారత్‌ వంటి పెద్ద దేశానికి రాజ్యాంగం రచించడం అంత సామాన్య విషయం కాదని అన్నారు. దేశపౌరుల గౌరవానికి, దేశ ఐక్యతకు మన రాజ్యాంగం ప్రతీక అని అన్నారు. మహానీయుల

కృషివల్లే ప్రపంచంలో ఎక్కడా లేని రాజ్యాంగం మనకు సొంతమైందని చెప్పారు. రాజ్యాంగ నిర్మాతలు తపస్సు చేశారని అన్నారు. భారత రాజ్యాంగాన్ని ఎంత గౌరవించినా, పొగిడినా, ఎంత మెచ్చుకున్నా తక్కువేనని అన్నారు. రాజ్యాంగంపై నిరంతరం చర్చ జరుగుతూ ఉండాలని, రాజ్యాంగంపై ప్రతి ఒక్క పౌరుడికి అవగాహన కల్పించాలని చెప్పారు. నేటి ప్రతి పౌరుడికి రాజ్యాంగం అర్ధమయ్యే రీతిలో అవకాశం కల్పించాలని, ప్రజల్లోకి కూడా రాజ్యాంగంపై చర్చను తీసుకెళ్లాలని అన్నారు. రాజ్యాంగ నిర్మాణం విషయంలో మహనీయుల కృషిని చర్చించిన అందరికీ ధన్యవాదాలని, ప్రతి ఒక్కరు చక్కటి అభిప్రాయాలను తెలిపారని మోదీ సభను ఉద్దేశించి అన్నారు. భారత దేశాభివృద్ధిలో ఎంతోమంది నాయకుల కృషి ఉందని అన్నారు. ప్రధాని బాధ్యతలు చేపట్టిన ప్రతి ఒక్కరూ దేశాన్ని ముందుకు తీసుకెళ్లారని చెప్పారు. భారత దేశంలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి రాజ్యాంగ భావనను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, విద్యాసంస్థల్లో కూడా రాజ్యాంగంపై చర్చ జరగాలని అన్నారు.

భారత అభివృద్ధిలో ప్రతీ ప్రధాని పాత్ర ఉందని తాను ఎర్రకోటపై నుంచి చెప్పిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. కొన్ని ప్రభుత్వాలు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయలేక పోవచ్చని తెలిపారు.  ప్రపంచంలోని అన్ని మతాలను మన దేశంలో అనుసరిస్తోన్నారని వెల్లడించారు. భారత్‌లాంటి రాజ్యాంగాన్ని రూపొందించడం అంత సులువు కాదన్నారు. రాజ్యాంగ రూపకల్పనకు కృషి చేసిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. చివరగా  ఐడియా ఆఫ్‌ ఇండియా పేరుతో ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో అదరగొట్టారు. ఐడియా ఆఫ్‌ ఇండియా అంటూ భారత్‌లో అనాదిగా ఉన్న సర్వధర్మ సమ భావనను చాటి చెప్పారు. సత్యమేవ జయతే నుంచి మొదలు పెట్టి జననీ జన్మభూమిశ్చ దాకా అన్ని సూక్తులను,సనాతన ధర్మాలను ఏకరువు పెట్టారు. అహింస భారత విధానమన్నారు. నారీ తూ నారాయణి అంటూ మహిళ స్వయంగా దేవతతో సమానమన్నారు. యత్ర నార్యంతు పూజ్యంతే అంటూ స్త్రీని కొలిచే దేశమని అన్నారు. జనసేవే దైవసేవ అని తెలిపారు. ఆయన ముగింపు సందర్భంగా లోక్‌సభలో అధికార పక్షం చప్పట్లు కొట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *