నాగార్జునసాగర్,అక్టోబర్23(జనంసాక్షి): 35 ఏళ్లుగా నాగార్జునసాగర్ ఎడమ కాల్వ మొదటి తూము రాజవరం మేజర్ ఆయకట్టుకు సాగు నీరందించలేని జానారెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో సాగు నీరు ఎలా వచ్చిందో సమాధానం చెప్పాలని టిఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య అన్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుని మొసలి కన్నీరు కారుస్తూ అధికారం కోసం ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తుందన్నారు. నాగార్జునసాగర్ జలాశయం డెడ్ స్టోరేజీ లోనూ రెండో పంటకు సాగు నీరిచ్చి రైతాంగ ప్రయోజనాలను కాపాడి, టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకుందన్నారు. సమైక్య పాలనలో పదవులకు అమ్ముడు పోయిన చరిత్ర జానారెడ్డిదన్నారు. దశాబ్దాలుగా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిపిస్తూ వచ్చిన ప్రజల సంక్షేమాన్నే విస్మరించిన జానారెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అథోగతి పాలు చేశాడన్నారు. ఏళ్ల తరబడి అవినీతిలో కూరుకుపోయి రాష్ట్రాన్ని కాంగ్రెస్ నేతలు భ్రష్టుపట్టించారన్నారు. అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచిన సీఎం కేసీఆర్ ప్రభంజనంలో ప్రతిపక్ష నాయకులు కొట్టుకు పోవడం ఖాయమన్నారు. పార్టీ నిర్ణయమే అందరికీ శిరోధార్యమని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల నర్సింహయ్య అన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకునేందుకు కార్యకర్తలంతా ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. రైతు బంధు, కల్యాణలక్ష్మి, వసతి గృహాల్లో సన్న బియ్యం, కేసీఆర్ కిట్లు వంటి సంక్షేమ పథకాలను అమలు చేసిన టీఆర్ఎస్ను ప్రజలు రానున్న ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు చాలా అభివృద్ధి చేసిందని, ప్రజలు తనను ఆశీర్వదిస్తే మరింత చేసి అభివృద్ధి చేసి చూపుతామని నోముల అన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం మహిళల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఎస్సీ, బీసీ కమ్యూనిటీ హాళ్లను త్వరలోనే పూర్తిచేస్తామన్నారు.
జానారెడ్డి చేసిందేవిూ లేదు: నోముల




