జిల్లాలో 19 ఉల్లిపాయల విక్రయ కేంద్రాలు

పొన్నూరు టౌన్‌: పెరిగిన ఉల్లిపాయల ధరల నేపథ్యంలో సామాన్యులకు కూడా ఉల్లిని అందుబాటులోకి తెచ్చేందుకు జిల్లాలో 19 రాయితీ విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి చిట్టిబాబు తెలిపారు. గురువారం పొన్నూరులో జరిగిన విలేకర్ల సమావేశంలో డీఎస్‌వో చిట్టిబా బు మాట్లాడుతూ జిల్లాలో తొలు త రైతు బజారుల్లో ఈ విక్రయ కేంద్రాలు ప్రారంభించినట్లు చెప్పారు. అయితే నియోజకవర్గ కేంద్రాల్లో రాయితీ ఉల్లిని విక్రయించాలనే ప్రభుత్వ సూచనలతో మరో 11 కేంద్రాల్లో విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రస్తుతం ఒక్క రేషన్‌ కార్డుదారుడికి నెలకు రెండు కిలోల చొప్పున కిలో రూ.20లకువిక్రయిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో నియోజకవర్గానికి 17 టన్నుల ఉల్లిపాయలు అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఉల్లి రేట్లు దిగి వచ్చే వరకు సరిపడా సుమారు వెయ్యి టన్నుల ఉల్లిపాయలు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ప్రతిరోజు తహసీల్దార్ల నుంచి సమాచారం తెలుసుకుని ఉల్లిపాయలు సరఫరా చేస్తామని తెలిపారు. అలాగే ఈ నెల నుంచి జిల్లాలోని 2,714 చౌక డిపోల ద్వారా ఈ-పోసు విధానంలో సరుకులు పంపిణీ చేస్తామన్నారు. గతం లో జిల్లాలోని 11 పురపాలక సంఘాల్లో 567 బయోమెట్రిక్‌ మిషన్ల ద్వారా సరుకుల పంపిణీ చేయగా ప్రభుత్వానికి నెలకు రూ.1.58 కోట్ల నుంచి రూ.1.94 కోట్లు రాయితీ ధనం ఆదా అవుతున్నట్లు తెలిపారు. సమావేశంలో ఏఎస్‌వో యలమందరావు తదితరులు పాల్గొన్నారు.