Friday, 6 November 2026

జీవవైవిధ్యం గొప్ప వారసత్వ సంపద

– జంతువులను పూజించే సంస్కృతి మనది
– వ్యవసాయంలో విచక్షణారహితంగా రసాయనాల వాడకాన్ని తగ్గించాలి
– వాటివల్ల క్యాన్సర్‌ ప్రబలే అవకాశముంది
– హైదరాబాద్‌ నగరం కాంక్రీట్‌ జంగిల్‌గా మారిపోయింది
– జీవవైవిధ్యం, పర్యావరణ పరిరక్షణలో ప్రతిఒక్కరు బాధ్యత తీసుకోవాలి
– తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నర్సింహన్‌
– సుభాష్‌ పాలేకర్‌ స్ఫూర్తితో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం
– హరితహారంలో మూడేళ్లలో 87కోట్ల మొక్కలు నాటాం
– అటవీశాఖ మంత్రి జోగు రామన్న
హైదరాబాద్‌, మే22(జ‌నం సాక్షి ): జీవవైవిధ్యం గొప్ప వారసత్వ సంపద, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. మంగళవారం రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సును గవర్నర్‌ నరసింహన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. జీవ వైవిధ్యానికి తానే నిజమైన నిదర్శనమని చెప్పారు. నర, సింహం పేరులోనే భిన్న వైవిధ్యం ఉందన్నారు. అది సమన్వయం చేసుకుంటూ వెళ్లడమే జీవితమని తెలిపారు. భారతీయ సంప్రదాయంలో జంతువులు, చెట్లను పూజించే సంస్కృతి ఉందన్నారు. వ్యవసాయంలో విచక్షణారహితంగా రసాయన ఎరువులు, పురుగుమందులు వాడుతున్నారని తెలిపారు. రసాయన అవశేషాలు కలిగిన ఆహారం తినడం వల్ల క్యాన్సర్‌ ప్రబలుతుందన్నారు. ఇకనైనా ఆ విధానాలకు స్వస్తి చెప్పాలన్నారు. హైదరాబాద్‌ నగరం కాంక్రీటు జంగిల్‌గా మారిపోయిందని, పచ్చదనం అదృశ్యమైందని మనమంతా అంగీకరించాలని గవర్నర్‌ పెర్కొన్నారు. ఒకప్పుడు చెరువులతో విలసిల్లిన భాగ్యనగరం ఇప్పుడు కనుమరుగైందని గవర్నర్‌ పేర్కొన్నారు. ఆ చెరువులన్నీ కలుషితమై పోయాయని తెలిపారు. ఒకప్పుడు సుందరంగా ఆహ్లాదం పంచిన హుస్సేన్‌సాగర్‌ ఈ దుస్థితికి కారణం ఎవరని ప్రశ్నించారు. జంట నగరాల్లో చెరువులు, నీటిని కలుషితం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. తానిది గవర్నర్‌గా చెప్పడంలేదని ఓ పౌరుడిగా చెబుతున్నట్లు స్పష్టం చేశారు. జీవ వైవిధ్యం, పర్యావరణ పరిరక్షణలో ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదని ప్రతి ఒక్కరి బాధ్యత ఉంటుందని వివరించారు.అనంతరం అటవీ శాఖ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ.. జీవవైవిధ్యం సంరక్షణలో తెలంగాణ ముందంజలో ఉందని తెలిపారు. భూగర్భ జలాల పెంపునకు మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథతో పాటు మరిన్ని ప్రాజెక్టులను నిర్మిస్తున్నామని చెప్పారు. మూడేళ్లలో 87 కోట్ల మొక్కలు నాటిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని పేర్కొన్నారు. సుభాష్‌ పాలేకర్‌ స్ఫూర్తితో సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహం ఇస్తున్నామని జోగు రామన్న పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, సీఎస్‌ ఎస్‌కే జోషి, కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎస్‌కే పట్నాయక్‌, వీసీ ప్రవీణ్‌రావు పాల్గొన్నారు.
————————————————-