జూన్ 3నుండి చంద్రబాబు జిల్లాల బాట
– 2న విజయవాడ బెంజ్ సర్కిల్‌లో నవ నిర్మాణ దీక్ష
అమరావతి, మే29(జనం సాక్షి) : నవనిర్మాణ దీక్షలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పర్యటనలు ఖరారయ్యాయి. జూన్ 3వ తేదీ నుంచి ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలు చేయనున్నారు. నవ నిర్మాణ దీక్ష, మహాసంకల్పంలో భాగంగా గ్రామదర్శిని, గ్రామ సభలు పేరిట కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గ్రామదర్శినిలో భాగంగా గ్రామంలో జరిగిన, జరుగుతున్న కార్యక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్వీయ పర్యవేక్షణ చేయనున్నారు. గ్రామసభల్లో జరిగిన అభివృద్ధిపై నివేదిక, భవిష్యత్ లక్ష్యాల నిర్దేశం చేయనున్నారు. జూన్ 2వ తేదీన విజయవాడ బెంజ్ సర్కిల్‌లో నవ నిర్మాణ దీక్షలో చంద్రబాబు పాల్గొనున్నారు. అనంతరం జూన్ 3న వ తేదీ కర్నూలు జిల్లాలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదేవిధంగా జూన్ 4వ తేదీ విజయనగరం జిల్లాలో, జూన్ 5వ తేదీ తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో, 6వ తేదీ కడప జిల్లాలో, 6వ తేదీ చిత్తూరు జిల్లాలో, 7వ తేదీ నెల్లూరు నగరంలో జరిగే మహా సంకల్పం బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.