తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల మేనేజ్ మెంట్స్ అసోసియేషన్
హైదరాబాద్,నవంబర్1(జనంసాక్షి): తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల మేనేజ్ మెంట్స్ అసోసియేషన్ టీఆర్‌ఎస్ కు మద్దతు ప్రకటించింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వమే మళ్లీ రావాలని తాము కోరుకుంటున్నామని తెలిపింది. హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ లోని టెక్నికల్ ఎడ్యుకేషన్ భవన్ లో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కొంతమంది ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు చిన్న చిన్న విషయాలను పెద్దవి చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నారని అసోసియేషన్ నేత పరమేశ్వర్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయడాన్ని స్వాగతించారు. కొంతమంది కేజీ టు పీజీ యాజమాన్యాల పేరుతో ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని తప్పుపట్టారు. కొందరు ప్రైవేట్ కాలేజీల మేనేజ్ మెంట్లు రాజకీయాల్లోకి రావాలని మహాకూటమికి మద్దతు ఇస్తున్నామని అంటున్నారని, అది వారి వ్యక్తిగతం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ విద్యావ్యవస్థకు అండగా ఉందని అసోసియేషన్ అధ్యక్షుడు ప్రకాశ్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వల్ల ప్రైవేట్ కాలేజీలు మూతపడు తున్నాయని కొందరు దుష్పచ్రారం చేస్తున్నారని మండిపడ్డారు. కాలేజీలు నాణ్యమైన విద్యను అందించక పోవడం వల్లనే మూతపడ్డాయని స్పష్టం చేశారు. ప్రైవేట్ కాలేజీల పెద్దలు కొందరు కావాలనే కుట్రలు చేశారని.. తమకు, ప్రభుత్వానికి మధ్య దూరం పెంచారని విమర్శించారు. గత ప్రభుత్వాలు బకాయి పెట్టిన విద్యార్థుల ఫీజులు, స్కాలర్ షిప్పులను కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వం చెల్లించిందని అసోసియేషన్ వ్యవస్థాపకుడు నరేందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించిందని స్పష్టం చేశారు. 2017-18 లో రూ.1945 కోట్లు ఫీజు రీయింబర్స్ అయితే.. రూ.1447 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు 95 శాతం ఫీజు రీయింబర్స్ మెంట్ ప్రభుత్వం చెల్లించిందని వెల్లడించారు. 2017-18 సంవత్సరానికి ఇంకా 25 శాతం ఫీజు మాత్రమే ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని, అది కూడా మార్చి నెలకల్లా ప్రభుత్వం చెల్లిస్తుందని భరోసా ఇచ్చారు.




