పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపణ
నోటీస్ ఇవ్వకుండానే బహిష్కరించడం దారుణం అన్న ఎమ్మెల్సీ
హైదరాబాద్,నవంబర్23(జనంసాక్షి): పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఎమ్మెల్సీ కె.యాదవరెడ్డిని తెలంగాణ రాష్ట్ర సమితి బహిష్కరించింది. ఈ మేరకు ఆ పార్టీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు అందులో పేర్కొంది. మరోవైపు యాదవరెడ్డి మేడ్చెల్‌లో జరిగే సభలో యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆయనతో పాటు ఇటీవలే పార్టీ నుంచి వైదొలిగిన ఆ పార్టీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి సైతం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. అయితే బహిష్కరణ వేటుపై యాదవరెడ్డి స్పందించారు. తాను పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి కార్యకలాపాలకూ పాల్పడలేదన్నారు. తనను పార్టీ నుంచి బహిష్కరించారనే విషయం విూడియా ద్వారానే తెలిసిందన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి తాఖీదులూ అందలేదని చెప్పారు. నోటీసులు అందాక కార్యకర్తలతో చర్చించి భవిష్యత్తు నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారు. తెరాసలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించారు. కేవలం ఒకరిద్దరు చేతుల్లోనే పార్టీ నడుస్తోందని ఆరోపించారు. టీఆర్‌ఎస్ పార్టీ నుంచి బహిష్కరించినట్లు కనీసం లేఖ కూడా ఇవ్వలేదని యాదవరెడ్డి పేర్కొన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ… తనను వివరణ అడగకుండా పార్టీ నుంచి బహిష్కరించడం బాధాకరమన్నారు. అలాగే టీఆర్‌ఎస్ పార్టీకి సిద్దాంతాలు లేవని, నేను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని, దమ్ముంటే నిరూపించాలని ఆయన అన్నారు. అలాగే పార్టీ మార్పుపై త్వరలోనే స్పందిస్తానని యాదవరెడ్డి పేర్కొన్నారు. . యాదవరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారని, ఈ నేపథ్యంలోనే ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు టీఆర్‌ఎస్ ప్రకటించింది. నేడు యాదవ రెడ్డి సోనియా సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇకపోతే మరో ముగ్గురు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్సీలు సైతం కాంగ్రెస్‌లోకి వస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ సీరియస్‌గా దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. పార్టీని వీడే నేతలను ముందుగానే గుర్తించే పనిలో పడింది. ఇందులో భాగంగానే ఎమ్మెల్సీ యాదవరెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించినట్లు అర్థమవుతోంది.




