నేతలను చేర్చుకునేందుకు ప్రాధాన్యం
అభివృద్ది కార్యక్రమాలను వివరిస్తూ ముందుకు
హైదరాబాద్,అక్టోబర్31(జనంసాక్షి): ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు ఏర్పాటు చేసిన దొంగల కూటమికి బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే ఎన్నికల్లో తమ ప్రచారాస్త్రాలని అన్నారు. నియోజకవర్గం పరిధిలో ఓటర్లను వ్యక్తిగతంగా కలుస్తూ వాళ్లతో సంభాషిస్తున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నారు. మన నాయకుడు కేసీఆర్.. కారు గుర్తుకే ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. మరోవైపు గులాబీ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ సర్కార్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులవుతున్న ప్రధాన పార్టీల నాయకులు, కార్యకర్తలు, ఇతర సంఘాల వారు పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలో సుమారు 100మంది మెకానికులు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఆదిలాబాద్‌లో టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ముమ్మర ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. వార్డ్ నెంబర్ 30 కుర్షిద్ నగర్‌లో మంత్రి జోగు రామన్న ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. మంత్రి సమక్షంలో ఎంఐఎం పార్టీకి చెందిన వార్డ్ మాజీ కౌన్సిలర్ దేవేందర్ పార్టీలో చేరారు. భూపాలపల్లి ములుగు మండలంలోని ముద్దునూరు తండాలో టిఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి అజ్మీర చందూలాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామాల్లో కార్యకర్తలు, నాయకులతో కలిసి మాజీ స్పీకర్ మధుసూధనాచారి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.గ్రామాల్లో ఆడపడుచులు బతుకమ్మలు, బోనాలతో ఘన స్వాగతం పలికారు. అటవీ గ్రామాల ప్రజలు చూపిస్తున్న ఆదరణ మర్చిపోనని, గెలిచిన అనంతరం వారికి సేవచేసి రుణం తీర్చుకుంటానని అన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనలో అటవీ గ్రామాల ప్రజలు అభివృద్ధికి నోచుకో అవస్థలు పడ్డారన్నరు. 50 నెలల కాలంలో వారి కష్టాలను తీర్చడానికి ఎంతో కృషి చేశానన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని దాసరి క్యాంపు కార్యాలయంలో సుల్తానాబాద్ మండలం పూసాలకు చెందిన యువకులు వివిధ పార్టీల నుంచి టిఆర్ ఎస్ లో చేరారు. పెద్దపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్రంలోని రైతన్నల మోముల్లో చిరునవ్వులు చిందేలా పరిపాలన అందించాలన్నదే టీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఇంతకాలం పాలకుర్తి నియోజకవర్గంలోని రైతులకు ఆశించిన స్థాయిలో సాగు జలాలు లేక ఎన్నో ఏండ్లుగా ఇబ్బందులు పడ్డారని మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పట్టణాలకు వలసలు పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో స్థానిక రైతాంగాన్ని ఏనాడు పట్టించుకోలేదన్నారు. నియోజకవర్గంలో భూగర్భ జలాలు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నట్లు చెబుతున్నారని, అందుకే భూతల్లి తాపాన్ని తీర్చేందుకు సీఎం కేసీఆర్‌తో మాట్లాడి అన్ని మండలాలకు ఎస్సారెస్పీ, దేవాదుల జలాలను తీసుకొచ్చినట్లు వివరించారు. ఎన్నికల సమయంలో ప్రజల ముందుకు వచ్చే ప్రతిపక్ష పార్టీలను గతంలో ఏం చేశారని నిలదీయాలన్నారు. తనను మరోసారి ఆశీర్వదించాలని కోరారు.




