– ఈరెండు పార్టీలు అనధికార పొత్తుపెట్టుకున్నాయి
– అవినీతి తెరాసను ఓడించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు
– విలేకరుల సమావేశంలో ఏఐసీసీ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సుర్జీవాల
హైదరాబాద్, నవంబర్24(జనంసాక్షి) : తెలంగాణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కి ఓటు వేస్తే.. బీజేపీకి వేసినట్టే అని ఏఐసీసీ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సుర్జీవాల ఆరోపించారు. ఆ రెండు పార్టీలకు అనధికార పొత్తు ఉందని అన్నారు. శనివారం గాంధీభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడితే కేసీఆర్ మద్దతు తెలిపారని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ ప్రైవేట్ లిమిటెడ్ అక్రమాలపై చార్జీ షీట్ విడుదల చేస్తున్నామని ఆయన తెలిపారు. నాలుగేండ్ల మూడు నెలల కేసీఆర్ పాలన అంతా అవినీతి మయం అని విమర్శించారు. కారులో కేసీఆర్, కేటీఆర్, కవిత, సంతోష్, హరీష్ లకే చోటు ఉందనీ.. తెలంగాణ ప్రజలకు చోటు లేదని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ కోటరీ కుటుంబ పెత్తనం ఎక్కువగా ఉందని ఆయన వెల్లడించారు. అవినీతిలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రపంచ రికార్ట్ సాధించిందని ఆయన ఆరోపించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చే నాటికి 7 వేల కోట్ల మిగులు బడ్జెట్ లో ఉండేది, నేడు రాష్ట్రాన్ని 2 లక్షల 20 వేల కోట్లు అప్పుల్లోకి నెట్టారని తెలిపారు. తెలంగాణ అమరవీరులకు కేసీఆర్ అన్యాయం చేశారని విమర్శించారు. 1200 మంది చనిపోతే కేవలం 400 మందిని మాత్రమే గుర్తించారని తెలిపారు. ఒక్క మహిళను కూడా కేబినెట్ లోకి తీసుకోని సీఎం కేసీఆర్ ఒక్కరే అని స్పష్టం చేశారు. కేసీఆర్ దళిత, మైనార్టీ, బీసీల ద్రోహి అని రణదీప్ సుర్జీవాల ఆరోపించారు. ఈకార్యక్రమంలో తెలంగాణ పార్టీ ఇన్‌చార్జి కుంతియా, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ పాల్గొన్నారు.




