Monday, 2 November 2026

టీఆర్‌ఎస్‌.. మేనిఫెస్టోకు ఉన్న విలువను తీసింది

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌
– బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసిన లక్ష్మణ్‌, కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌, నవంబర్‌29(జ‌నంసాక్షి) : టీఆర్‌ఎస్‌.. మేనిఫెస్టోకు ఉన్న విలువను తీసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ విమర్శించారు. గురువారం ఆయన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ… అధికారంలో ఉన్న పార్టీలు మేనిఫెస్టోలను అమలు చేయడంలో విఫలం చెందాయన్నారు. టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోకు ఉన్న విలువను తీసిందన్నారు. సిద్ధాంత, విలువలతో కూడిన బీజేపీ.. మేనిఫెస్టోను ఒక పవిత్రత కలిగినదిగా బావిస్తోందని తెలిపారు. ఇప్పుడు చేయలేని పనిని అధికారంలోకి రాగానే చేస్తానని కేసీఆర్‌ చెప్తున్నాడని మండిపడ్డారు. 2004 నుండి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌.. ఒక్కనాడు కూడా ప్రజా సమస్యలను పట్టించుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మా మేనిఫెస్టోలో బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తున్నామన్నారు. తెలంగాణ భవిష్యత్తును నిర్దేశించేదిగా ఈ మేనిఫెస్టో ఉందని లక్ష్మణ్‌ అన్నారు.
రైతులు, రైతాంగానికి, వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం కల్పిస్తున్నామన్నారు. అనేకమంది నుండి అభిప్రాయాలు తీసుకొని ఈ మేనిఫెస్టో రూపొందించాం అని తెలిపారు. ఇంటి అద్దెపై మేము 5000 కిరాయి ఇస్తామంటే.. కాంగ్రెస్‌ పార్టీ మా పథకాన్ని కాపీ కొట్టి మేము ఇస్తామని డబ్బా కొట్టుకుంటున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే అది బీజేపీ గెలుపుతోనే సాధ్యమవుతుందని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చడమే కాకుండా, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేలా బీజేపీ మేనిఫెస్టోను అమల్లోకి తీసుకొచ్చామని తెలిపారు. ప్రజలంతా బీజేపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని, డిసెంబర్‌ 11న వెలుబడే ఫలితాల్లో బీజేపీ విజయం ఖాయమవుతుందన్నారు.