Sunday, 8 November 2026

టీడీపీలో మళ్లీ దాడుల కలకలం..

– ఎంపీ సుజనా చౌదరి సంస్థల్లో ఈడీ తనిఖీలు
– నాగార్జున హిల్స్‌లోని బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌లో సోదాలు
హైదరాబాద్‌, నవంబర్‌24(జ‌నంసాక్షి) : తెలుగుదేశం పార్టీలో మళ్లీ ఐటీ దాడుల కలకలం రేపాయి. పార్టీ ఎంపీ సుజనా చౌదరి సంస్థల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించడం కలకలానికి కారణమైంది. డొల్ల కంపెనీలను స్థాపించి కోట్ల రూపాయలు కొల్లగొట్టారన్న ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్‌లోని నాగార్జున హిల్స్‌లో ఉన్న బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌ సంస్థలో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులనే డైరెక్టర్‌లుగా చూపించి గంగా స్టీల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, భాగ్యనగర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ట్రేడింగ్‌ లిమిటెడ్‌, తేజస్విని ఇంజనీరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఫ్యూచర్‌ టెక్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీలకు పెద్ద మొత్తంలో డబ్బు మళ్లించారన్న ఆరోపణలపై ఆరాతీశారు. పలు బ్యాంకుల నుంచి రూ.304 కోట్లు దుర్వినియోగం చేశారన్నది మరో ఆరోపణ. ఎటువంటి కొనుగోళ్లు జరపకుండానే కేవలం రశీదు రూపంలో డబ్బు మళ్లించినట్టు వచ్చిన ఆరోపణలపై 2016 ఫిబ్రవరిలోనే సీబీఐ అధికారులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. గత అక్టోబరులో ఈడీ సోదాలు నిర్వహించి పెద్ద ఎత్తున హార్డ్‌ డిస్క్‌లు, ఫైల్స్‌తోపాటు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుత సోదాల్లోను మరికొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఐటీ దాడుల సందర్భంగా సృజనా చౌదరి స్పందించారు.. ఐటీ అధికారులు తమ ఇళ్లలో దాడులు నిర్వహించారని అన్నారు. వారికి కావాల్సిన పత్రాలను, అడిగిన ఆధారాలను అన్నింటిని ఇచ్చానని తెలిపారు.
తెదేపాపై కుట్రతోనే ఈడీ దాడులు – మంత్రి యనమల
తెలుగుదేశం ప్రభుత్వం, ఆ పార్టీ నేతలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, ఇందులో భాగంగానే పార్టీ ఎంపీ సుజనా చౌదరి సంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాడులని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. దేశానికి, రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న ప్రధాని మోదీకి 2019లో జరిగే ఎన్నికల్లో తీవ్ర పరాభవం తప్పదని హెచ్చరించారు. శనివారం ఆయన రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడారు.. రానున్న ఎన్నికల్లో మోదీని గద్దె దించడమే తెలుగుదేశం పార్టీ ప్రధాన అజెండా అన్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రధానిగా ఎవరు ఉండాలన్న విషయంలో చంద్రబాబు నిర్ణయం కీలకం కానుందని జోస్యం చెప్పారు. ఇక, వైసీపీ, జనసేన గురించి చెప్పేదేవిూ లేదని, రెండు పార్టీలదీ కుర్చీ యావ మాత్రమేనన్నారు.