టీడీపీ నేతలు..  ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి

– తనతప్పులను కేంద్రంపై రుద్దాలని బాబు చూస్తున్నాడు
– తిత్లీ విపత్తును కూడా చంద్రబాబు రాజకీయంగా వాడుకుంటున్నాడు
– విలేకరుల సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ
గుంటూరు, అక్టోబర్‌17(జ‌నంసాక్షి) : టీడీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకొనేది లేదని, ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ హెచ్చరించారు. బుధవారం గుంటూరు పర్యటన సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొబ్బరి చిప్పలు, చెప్పులు దొంగిలించే నేతలు టీడీపీలో ఉన్నారని విమర్శించారు. టీడీపీ నేతలు ఉపయోగిస్తున్న భాష అభ్యంతరకరమని ఆయన అన్నారు. బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావును, టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ లైవ్‌లో తిట్టడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. టీడీపీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఆయన హెచ్చరించారు. రాష్ట్రాన్ని దోచుకుతింటూ కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారని కన్నా తీవ్ర స్థాయిలో విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని తిడుతూ బాధ్యతల నుంచి తప్పించుకోవాలనుకుంటున్నారని, విపత్తును కూడా రాజకీయాలకు వాడుకోవాలనుకుంటున్నారని కన్నా ధ్వజమెత్తారు. కాల్‌మనీ, సెక్స్‌రాకెట్‌ నిందితులు టీడీపీలో ఉన్నారని తీవ్రంగా విమర్శించారు. టీడీపీ అధినేతను తెలంగాణ సీఎం కేసీఆర్‌ తిట్టగానే అందరూ దాని గురించే మాట్లాడుతున్నారని, కానీ మోదీని చంద్రబాబు తిట్టినప్పుడు విూరంతా ఏం చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు, తిత్లీ విపత్తును కూడా రాజకీయాలకు వాడుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా కన్నా ముఖ్యమంత్రికి మరో ఐదు ప్రశ్నలు సంధించారు. పల్నాడులో అక్రమ మైనింగ్‌పై సీబీఐతో విచారణ జరిపించుకోగలరా ?,
ఎస్టిమేషన్లు పెంచి సీఎం రమేశ్‌కు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇచ్చిన మాట వాస్తవం కాదా?
. మంత్రి ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బా రెడ్డిలను కూర్చోబెట్టి వాటాలు పెంచుకోమని చెప్పలేదా?
. రూ.480 కోట్ల రూపాయలంతో నిరుద్యోగులకు ఇచ్చే శిక్షణకు ప్రైవేటు సంస్థలకు ఇవ్వడంలో అంతర్యం ఏమిటి?. ఐటీ దాడులు చేస్తే రాష్ట్రంలో భావోద్వేగాలను ఎందుకు రెచ్చగొడుతున్నారు అంటూ కన్నా చంద్రబాబును ప్రశ్నించారు. వెంటనే చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

తాజావార్తలు