టీడీపీ, వైసీపీ దొందూదొందే
– ఆ రెండు పార్టీల విధానాలు ఒక్కటే
– ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులు ఏకంకావాలి
– పీటీపీఐఆర్ పేరిట లక్షల ఎకరాల భూముల్ని లాక్కున్నారు
– సీపీఎం, సీపీఐ నేతలు బి రాఘవులు, నారాయణ
– విశాఖలో సీసీఎం, సీపీఐ ఆధ్వర్యంలో బహిరంగ సభ
విశాఖపట్టణం, సెప్టెంబర్1(జనం సాక్షి ) : టీడీపీ, వైఎస్‌ఆర్ సీపీ పార్టీల విధానాలు ఒక్కటేనని, వాటికి మద్దతుగా నిలవటం అంటే పెట్టుబడిదారి విధానానికి వత్తాసు పలకటమేనని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు అన్నారు. విజయవాడలో సెప్టెంబర్ 15న నిర్వహించే మహాగర్జనకు ప్రజలను సమాయత్తం చేస్తూ సిపిఎం-సిపిఐ ఆధ్వర్యంలో శనివారం విశాఖలో బస్సు యాత్ర చేపట్టారు. ముందుగా బహిరంగ సభ నిర్వహించారు. సభలో సీపీఐ జాతీయ నాయకులు నారాయణతో కలిసి సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.రాఘవులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ.. టిడిపి, వైసిపి విధానాలు రాష్ట్రంలో ఒకే విధంగా ఉన్నాయన్నారు. టిడిపి, వైసిపిలు ఇంతవరకూ చాలా పాదయాత్రలు, బస్సు యాత్రలు చేశాయి కాని రాష్ట్ర ప్రజల సమస్యల్ని పరిష్కరించలేకపోయాయని అన్నారు. సమస్యల పరిష్కారానికి ఎలాంటి ప్రత్యామ్నాయాన్ని చూపలేకపోయాయని దుయ్యబట్టారు.
రాజకీయలబ్ధికోసం ప్రధాన పార్టీలు పాకులాడుతోన్న వేళ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక ¬దా ముసుగులో అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. రాజకీయలబ్ధికోసం ప్రధాన పార్టీలు పాకులాడుతుంటే… ప్రత్యామ్నాయ శక్తులు ఏకం కావాలన్నారు. మరోవైపు దేశంలో మతపరమైన ఓటుబ్యాంక్ రాజకీయాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజలకు సుస్ధిరపాలన అందించే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వాలకు లేవని, బస్సు యాత్ర చేసి ప్రజలను చైతన్య పరిచి అనుకూల శక్తులను కూడదీసుకుంటామన్నారు. అనంతరం సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. 2014కు ముందే విశాఖ రైల్వే జోన్ కోసం రైల్వే పోరాట సాధన కార్యాచరణ కమిటి వేశారని తెలిపారు. అధికారంలోకి వస్తే విశాఖ రైల్వే జోన్ ఇస్తామన్న టిడిపి, వైసిపి నేతలు రాష్ట్ర ప్రజలను నయవంచన చేశారన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ.. పిటిపిఐఆర్ పేరిట చంద్రబాబు లక్షల ఎకరాల భూముల్ని లాక్కున్నారని తెలిపారు. అమరావతిలోలానే లాండ్‌పూలింగ్ పేరిట విశాఖలో కూడా చేయాలనుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నూతన రాజకీయ వ్యవస్థను నిర్మించేందుకు చేపట్టే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సభ అనంతరం బస్సు యాత్ర ప్రారంభించారు.