Wednesday, 4 November 2026

ట్రూజెట్‌ ఉచితంగా సరుకుల రవాణా

హైదరాబాద్‌,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): కేరళ ప్రజలను ఆదుకోవడానికి ట్రూజెట్‌ విమానయాన సంస్థ ముందుకొచ్చింది. తెలంగాణ, తమిళనాడు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థల నుంచి సేకరించిన వస్తువులను మూడురోజులు ఉచితంగా రవాణాచేస్తామని తెలిపింది. కేరళలో చిక్కుకున్న ప్రయాణికులను తిరువనంతపురం నుంచి ఉచితంగా చెన్నై, హైదరాబాద్‌లకు తీసుకొస్తామని సంస్థ సీఈవో విశోక్‌ మాన్‌సింగ్‌ తెలిపారు.కేరళ వరద బాధితుల సహాయార్థం పంపించే సామగ్రి, ఆహార పదార్థాలను ఉచితంగా రవాణాచేస్తామని రైల్వేశాఖ ప్రకటించింది. రైల్వే బోర్డు డైరెక్టర్‌ శిల్పి బిష్నోయి ఈ మేరకు రెండురోజుల క్రితం అన్ని రైల్వే జోన్ల జనరల్‌ మేనేజర్లకు ఉత్తర్వులు జారీచేశారు. దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా ప్రభుత్వశాఖలు పంపించే సహాయ సామగ్రిని రైల్వేలో ఉచితంగా బుక్‌చేయవచ్చని బిష్నోయి తెలిపారు. ప్రైవేట్‌, ఇతర సంస్థలు పునరావాస సామగ్రిని పంపించే సమయంలో సరుకుకు సంబంధించి స్థానిక జిల్లా మేజిస్టేట్ర్‌ లేదా డిప్యూటీ కమిషనర్‌తో సరుకు పంపించే, చేరే స్టేషన్ల వివరాలతో రైల్వే డివిజనల్‌ మేనేజర్ల వద్ద వివరాలను నమోదు చేయించి అనుమతి పొందాల్సి ఉంటుందన్నారు. ఈ నిబంధనలు ఈ నెల 31 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అమల్లో ఉంటాయని బిష్నోయి పేర్కొన్నారు.