– టీఆర్‌ఎస్ పతనం ప్రారంభమైంది
– ఆపార్టీని బొందపెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
– కేసీఆర్ ఫాంహౌస్‌కు, కేటీఆర్ అమెరికాకు వెళ్లడం ఖాయం
– అధికారంలోకి వచ్చిన 15రోజుల్లోనే రెంట్ రీయింబర్స్‌మెంట్ అందిస్తాం
– సంవత్సరంలో డబుల్ బెడ్‌రూం ఇల్లు కట్టిస్తం
– ఉద్యోగులకు పీఆర్‌సీ ప్రకటిస్తాం
– నాలుగేళ్లలో ఇచ్చిన హావిూలను కేసీఆర్ విస్మరించారు
– ప్రశ్నిస్తారనే భయంతోనే బాబుతో పొత్తేంటని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు
– విలేకరుల సమావేశంలో టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, నవంబర్23(జనంసాక్షి) : డిసెంబర్ 11న తరువాత తెలంగాణలో అధికారం చేపట్టేది మహాకూటమేనని టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ పార్టీని కేసీఆర్ కుటుంబ పాలన నుంచి విముక్తికి ఈ ఎన్నికలు మంచి అవకాశమని ప్రజలు భావిస్తున్నారన్నారు. తమ కుటుంబం బాగుచేసుకోవటం కోసమే తెలంగాణను తెచ్చామన్నట్లు కేసీఆర్, కేటీఆర్‌లు ఫీలవుతున్నారని ఉత్తమ్ విమర్శించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ముసుగుతో ప్రజలను మభ్యపెట్టి ప్రజలను మోసంచేసి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తరువాత నాలుగేళ్ల పాలనలో తెలంగాణ సెంటిమెంట్‌తో అవినీతికి, అక్రమాలకు పాల్పడ్డారని, ఇప్పుడు ప్రజలకు ఆ ముసుగు వెనుక జరిగే పరిస్థితులు అర్థమయ్యాయన్నారు. దీంతో డిసెంబర్ 7న జరిగే ఎన్నికల్లో కేసీఆర్‌కు, తెరాస అభ్యర్ధులకు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధమవుతున్నారని ఉత్తమ్ అన్నారు. ఈ ఎన్నికలు కేసీఆర్ వర్సెస్ తెలంగాణ ప్రజలని అన్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హావిూలను నిలబెట్టుకోలేక పోయాడన్నారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్‌రూం ఇండ్లు ఇలా అన్నింటిలో ఇచ్చిన హావిూలను అమలు చేయకుండా కేసీఆర్ కేవలం తన కుటుంబ సభ్యుల ఆస్తులు పెంచేందుకు కృషి చేశారని ఉత్తమ్ మండిపడ్డారు. ప్రజలు కేసీఆర్ కుట్రలను గమనించారని, కేసీఆర్ ఇచ్చిన హావిూల అమలుపై ఈ ఎన్నికలు రిఫరెండం అని అన్నారు. ప్రజలంతా ఐక్యంగా ఉన్నారని, టీఆర్‌ఎస్‌ను బొందపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఉత్తమ్ తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేఖత కేసీఆర్‌కు అర్థమైందని, అందుకే కాంగ్రెస్ చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంది, వారితో పెట్టుకుంది అంటూ ప్రజల్లో అర్థలేని మాటలు కేసీఆర్ మాట్లాడుతున్నాడని ఉత్తమ్ విమర్శించారు. జాతీయ స్థాయిలో పలు ఛానల్స్ నిర్వహించిన సర్వేలో తెలంగాణలో మహాకూటమి గెలుపు ఖాయమని స్పష్టంగా సర్వేలు వచ్చాయని, తెలంగాణలో డిసెంబర్ 12న ఏర్పడబోయేది మహాకూటమేనని ఉత్తమ్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన సోనియా, భావిభారత ప్రధాని రాహుల్‌గాంధీ తెలంగాణలో అడుగుపెట్టనున్నారని, యావత్ తెలంగాణ సమాజం వారి కోసం ఎదురు చూస్తున్నారని ఉత్తమ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి,, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంలతో ఆ పార్టీల క్యాడర్‌ను, అదేవిధంగా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, ఆర్‌కృష్ణయ్యను, తెలంగాణ సమాజం కోసం పనిచేసిన
గద్దర్‌తో పాటు తదితరులను ఆహ్వానించామని అన్నారు. డిసెంబర్ 12 తరువాత కేసీఆర్ ఫాంహౌస్‌కు, కేటీఆర్ అమెరికాకు పోవటం ఖాయమని అన్నారు. ముందుచూపుతో వారే ప్రకటించుకున్నందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఉత్తమ్ అన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని అర్బన్ ఏరియాల్లో నాలుగున్నారేళ్ల పాటు ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూశారన్నారు. 2016-17లో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో లక్ష ఇళ్లు, రాష్ట్రంలోని అర్బన్ ఏరియాల్లో 1.60లక్షల ఇండ్లు కట్టిస్తామని, ఇందుకు హట్కోనుంచి 17వేలకోట్ల రుణం వచ్చింది, అది బ్యాంకులో ఉందని లబ్ధిదారులను మోసం చేశారని విమర్శించారు. డబుల్ బెడ్‌రూం ఇండ్లు దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారికి మేం అధికారంలోకి వచ్చిన 15రోజుల్లో రెంట్ రీయింబర్స్ మెంట్ కింద రూ.50వేలు ఇవ్వనున్నట్లు ఉత్తమ్ తెలిపారు. సంవత్సరంలో వారికి డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టిస్తామన్నారు. ఈ పథకానికి ‘మా ఇంటి వెలుగు’అని పేరు పెట్టడం జరుగుతుందన్నారు. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన 15రోజుల్లోనే ఉద్యోగులకు పీఆర్సీని ప్రకటిస్తామని ఉత్తమ్ ప్రకటించారు. కోర్టు తీర్పుకు అనుగుణంగా అందరికీసమాన వేతనం కల్పిస్తామని ఉత్తమ్ పేర్కొన్నారు. మరో రెండు రోజుల్లో కాంగ్రెస్‌లోకి భారీగా వలసలు వస్తారని, ఇప్పటికే టీఆర్‌ఎస్‌లోని కీలక నేతలు కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారని అన్నారు. 28 న ఖమ్మం, తాండూరులో బహిరంగసభలు ఉంటాయని, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఎందుకు ఇవ్వలేకపోయారో మురళీధర్రావు చెప్పాలని, ఈసారి ఒక్క సీటు కూడా బీజేపీకి రాదని ఉత్తమ్ అన్నారు.
డిసెంబర్ 11తరువాత.. మహాకూటమిదే అధికారం




