విషజ్వరాల బారిన పడడంతో ఆందోళన
తక్షణ వైద్యం అందక సామాన్యుల విలవిల
హైదరాబాద్,సెప్టెంబర్6(జనం సాక్షి ) : విషజ్వరాల కారణంగా ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ప్రజలు తక్షణ వైద్యం కోసం నగరాలకు పరుగెత్తుతున్నారు. దీంతో జిల్లాల్లో పరిస్థితి వేరే చెప్పనక్కర్లేదు. జిల్లాల్లో డెంగీ నిర్దారణ కోసం కనీస సదు పాయాలు లేకపోవడంతో అనుమానిత కేసులన్నింటిని జిల్లాలో ఉన్నప్రధాన అస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు. రెఫరల్ కేసుల్లో 80 నుంచి 90 శాతం కేసులు డెంగీగానే తేలుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా వర్షాకాలంలో విష జ్వరాలు పెద్ద ఎత్తున ప్రబలడం జరుగుతోంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో అక్టోబర్, నవంబర్ మాసం వరకు విష జ్వరాలు, మలేరియా, టైపాయిడ్ వంటి జ్వరాలు కేసులు నమోదు అవుతాయని చెబుతూ డెంగీ నిర్దారణ సౌకర్యాలే లేనప్పుడు డెంగీగా నిర్దారణ ఎలా చేస్తారని వైద్య ఆరోగ్య శాఖ ధర్మ సందేహాలు వ్యక్తం చేయడం విమర్శలకు దారి తీస్తోంది. ఎడతెరిపి లేకుండా పక్షం రోజుల పాటు కురిసిన భారీ వర్షాలతో దోమలు విజృంభించి జనం మంచం పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అంతటా ఎక్కడ చూసినా జ్వర బాధితులే కనిపిస్తున్నారు. గతంలో చికెన్‌గున్యా, టైఫాయిడ్ వంటి జ్వరాలు కనిపిస్తే ఈసారి మాత్రం డెంగీ కేసులు భారీగా నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఫలితంగా జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు మొదలుకుని ప్రైవేటు నర్సింగ్ ¬ంల వరకు జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. ఒక్కో ఆసుపత్రిలో సగటున 200కు పైగా అవుట్ పేషంట్లు నమోదు అవుతున్నారంటే పరిస్థితిని ఊహించవచ్చు. ఆర్థిక స్థోమత కలిగిన బాధితులు మెరుగైన వైద్యం కోసం పట్టణాలకు పరుగులు తీస్తుంటే పేదలకు మాత్రం స్థానికంగా ఉండే ఆర్ఎంపీ, పీఎంపీలే పెద్ద దిక్కుగా మారారు. మైదాన ప్రాంతం అధికంగా ఉన్న ప్రాంతాల్లోనూ డెంగీ వేగంగా విస్తరిస్తున్నది. డెంగీ వ్యాధి నిర్దారణ కిట్లు జిల్లాలో ఎక్కడా అందుబాటులో లేవు. డెంగీ నిర్దారణ అయిన తరువాత చికిత్స కోసం ప్లేట్లేట్ సపరేటర్స్ వంటి యంత్రాలు అవసరమవుతాయి. అయితే జిల్లాలోని ఏ ఆసుపత్రిలోనూ నిపుణులను నియమించక పోవడంతో ఆ పరికరాల ఏర్పాటు కూడా మరుగున పడిపోయింది. జిల్లాల్లో విష జ్వరాల తీవ్రత పెరగడంతో రోగులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఇందులో సాధారణ జ్వరాలకు ఇక్కడే తాత్కాలిక చికిత్స చేపడుతున్నారు. అయితే జ్వరాలు తగ్గకుండా తరుచూ వస్తుంటే ఆ రోగులను ప్రధాన ఆసుపత్రులకు రెఫర్ చేస్తున్నారు. ముఖ్యంగా టైపాయిడ్, మలేరియా అనుమానిత కేసులను ప్రైవేటు వైద్యులు ఉన్నత ఆసుపత్రులకు పంపుతున్నట్లు చెబుతున్నారు. గతేడాది ఇదే సీజన్లో విష జ్వరాల కంటే అధికంగా మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ కేసులు నమోదు కావడంతో ముందు జాగ్రత్త చర్యగా అనుమానిత రోగులను సమగ్ర పరీక్షల కోసం సిఫారసు చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాల్లో డెంగ్యూ జ్వరాలకు సరైన చికిత్స వసతులు ఇక్కడ అందుబాటులో లేవు. ఈ కారణంగానే పొరుగు జిల్లాలకు వెళ్తున్నట్లు రోగులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే మామూలు వైరల్ జ్వరాలు వచ్చిన సందర్భాల్లోనూ ప్లేట్ లెట్స్ తగ్గి పోవడం సర్వసాధారణమేనని వైద్యులు చెబుతున్నారు. అయితే గ్రామాల్లో ఉండే ఆర్ఎంపీ, పీఎంపీల మాటలు నమ్మి పొరుగు జిల్లాలకు పరుగులు పెరుగుతున్నారన్నది ఆరోగ్య శాఖ వర్గాల వాదన. ముఖ్యంగా నిలువ ఉన్న నీటి వనరులు, బురద, మురికి కాలువలపై దోమల వృద్ధి వేగంగా జరుగుతుందని ఆరోగ్య శాఖాధికారులు చెబుతున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే పారిశుధ్య నిర్వహణ కోసం స్థానిక సంస్థలు మొదలుకుని మున్సిపాలిటీల వరకు శ్రద్ధ చూపక పోవడమే ఈ పరిస్థితికి కారణమని ఆరోగ్య శౄఖ అధికారులు చెబుతున్నారు. వర్షాలకు ముందు దోమల నియంత్రణ కోసం మందులు పిచికారి చేసినట్లు అధికారులు చెబుతున్నా పట్టణాల్లోనే పారిశుధ్య నిర్వహణ దారుణంగా తయారైన పరిస్థితి కనిపిస్తోంది. ఏజెన్సీతో పాటు మైదాన ప్రాంతాల్లో డెంగీ కేసుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడి రోగనిర్దారణ సదుపాయాలను పరిశీలిస్తే దారుణంగా ఉన్నట్లు తేలింది. సాధారణ జ్వరాలను మినహాయిస్తే మిగితా రోగాల నిర్దారణకు ఇతర జిల్లాలకు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి కొనసాగుతోంది.
డెంగీ నిర్దారణ కోసం జిల్లాలకు పరుగు




