Thursday, 5 November 2026

డ్వాక్రాల బలోపేతమే లక్ష్యం

అనంతపురం,నవంబర్‌12(జ‌నంసాక్షి): ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హావిూల అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళుతోందని మంత్రి పరిటాల సునీత అన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. రాష్ట్రం విడిపోయి ఇబ్బందుల్లో ఉన్నా మహిళలకు రెండో విడత రుణమాఫీ నిధులను విడుదల చేశారని తెలిపారు. అమరావతిలో సీఎం తన కార్యాలయంలో మొదటి సంతకం రుణమాఫీ నిధుల విడుదల ఫైల్‌పై సంతకం చేశారన్నారు. మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని.. ఇందుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని మంత్రి అన్నారు. ప్రతి కుటుంబం నెలకు రూ.10 వేలు ఆదాయం పొందాలన్న లక్ష్యంతో సర్వేను నిర్వహిస్తున్నామని తెలిపారు. అవినీతి రహిత సమాజం కోసం ఆయన నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ప్రధానంగా చంద్రన్న బీమా దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చాలనే లక్ష్యంతో ముందుకెళుతోందని తెలిపారు.