శ్రీకాకుళం,జూలై7(జనం సాక్షి): కార్మికుల వల్ల లాభాలు పొందుతున్న వరం పవర్ ప్లాంట్ యాజమాన్యం… బాధ్యతరాహిత్యంగా వ్యవహరించడం తగదని సిఐటియు నాయకులు అన్నారు. ఛార్టర్ ఆఫ్ డిమాండ్స్ పరిష్కారం కోసం యాజమాన్యానికి ఎన్నోసార్లు విన్నవించామని, కానీ చలనం లేకుండా వ్యవహరిస్తోందని విమర్శించారు. వెంటనే కార్మికులతో చర్చలకు రావాలని కోరారు. కార్మికశాఖతో పాటు జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకొని, కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని ఉధృతంచేస్తామని, ఆ తర్వాత చోటుచేసుకునే పరిణామాలకు అధికారులే బాధ్యత వహించాలన్నారు.యాజమాన్యం కార్మికులతో నూతన వేతన ఒప్పందం చేయకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 2018 మార్చితో గత వేతన ఒప్పందం ముగిసిందని, నేటికీ నూతన ఒప్పందం కుదుర్చుకోలేదని చెప్పారు. నూతన వేతన ఒప్పందం చేసుకోబోమని యాజమాన్యం తేల్చిచెప్పడం నిరంకుశత్వానికి నిదర్శమన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాల వల్ల విద్య, వైద్యం, నిత్యావసర ఖర్చులు భారీగా పెరిగాయని… అందుకనుగుణంగా కార్మికుల వేతనాలు పెరగకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.




