Wednesday, 4 November 2026

తగ్గని భానుడి ప్రతాపం

దంచికొడుతున్న ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి
హైదరాబాద్‌,మే28( జ‌నం సాక్షి ): అక్కడక్కడా క్యుములో నింబస్‌ మేఘాలతో వర్షాలు పడుతున్నా ఎంటలు మాత్రం దంచి కొడుతున్నాయి. 29న కేరళను రుతుపవనాలు తాకుతాయని చెబుతున్నా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మాత్రం తగ్గడం లేదు. ఎండవేడికి హైదరాబాద్‌ సహా ఉత్తర తెలంగాణ ప్రజలు అల్లాడిపోతున్నారు.
రోజురోజుకు ప్రచంఢ భానుడు తన ప్రతాపం చూపుతుండటంతో  ప్రజలు వేసవి తాపంతో అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు ఎండవేడిమి, వడగాల్పులకు తట్టులేకపోతున్నారు. గతేడాదికంటే ఈ ఏడాది ఎండలు గణనీయంగా పెరిగాయి. వారంరోజుల నుంచి 40-43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత శాతం నమోదైంది. ఉదయం 10గంటల లోపే ప్రజలు తమ పనులను ముగించుకుని ఇళ్లకు చేరుకుంటున్నారు. తిరిగి సాయంత్రం వాతావరణం చల్లబడిన తర్వాతే బయటకు వస్తున్నారు. ఉక్కపోత, వడగాల్పులతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వేసవితాపం నుండి ఉపశమనం పొందేందుకు జ్యూస్‌లు, పండ్ల రసాలు, నిమ్మ, పుచ్చకాయలు, కొబ్బరినీళ్లు, తాటిముంజళ్ల వంటి చల్లనిపానియాలు, పదార్థాలను సేవిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన వ్యాపారులూ ధరలనూ పెంచుతున్నారు. ఇదిలా ఉండగా డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు మండుటెండల్లోనే పరీక్షలకు హాజరవుతున్నారు. ద్విచక్ర వాహనాలపై  ప్రయాణించేవారు వేసవి తీవ్రతతో మరింత ఇబ్బందులకు గురవుతున్నారు. ఎండవేడిమి అధికంగా ఉండటంతో కొనుగోలుదారులు రాకపోతుండటంతో మధ్యాహ్నం సమయంలో కొన్ని వ్యాపార సంస్థలను మూసివేస్తున్నారు. సాయంత్రం సమయంలో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతుండటంతో అప్పుడు కిటకిటలాడుతున్నాయి. వేసవితాపాన్ని భరించలేక గ్రామాల్లో ఉపాధిపనులు చేస్తున్న కూలీలు ఉదయం 11 గంటలకు తమ పనులను ముగించుకుని ఇళ్లకు వస్తున్నారు. రోజూవారీ కూలీలు ఎండవేడిమికి అల్లాడిపోతూ వడదెబ్బకు గురై ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. దీంతో మధ్యాహ్నం సమయంలో ప్రధాన రహదారుల్లోనే కాకుండా అంతర్గత రహదారుల్లోనూ ప్రజల రాకపోకలు సాగించకపోవడంతో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. పక్కా గృహాల్లో ఉంటున్న వారూ గాలి పంకాల నుంచి వేడి గాలులు వస్తుండటంతో చెట్ల కింద, వేసవిదృష్ట్యా ఏర్పాటు చేసుకున్న చలువ పందిళ్ల కింద, మరికొంత మంది ఏసీలు, కూలర్ల సాయంతో సేదతీరుతున్నారు.