
– దేశంలో సంక్షేమ పథకాల్లో ముందున్నాం
– ఉప ఎన్నికల్లో విపక్షాలకు బుద్ధి చెప్పండి
– టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్
వరంగల్ నవంబర్17(జనంసాక్షి): ప్రభుత్వం ప్రజల కోసం పని చేయడం లేదని అనిపిస్తే శిక్షించాలని సీఎం కేసీఆర్ అన్నారు.మంగళవారం వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికల్లో భాగంగా హన్మకొండలో ఏర్సాటైన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. పసునూరిని వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పెద్ద మనుసుతో దీవించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పసునూరిని గెలిపించి తనకు బలం ఇవ్వాలని వరంగల్ ఓటర్లను కోరుతున్నానన్నారు.ఓటు వేసే ముందు ఓటర్లు ప్రభుత్వ వైఖరిని గమనించాలని కోరారు. ప్రభుత్వం చేస్తోన్న సంక్షేమ పథకాలను ప్రజలు చూసి టీఆర్ఎస్కు ఓటు వేయాలని అన్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వం చేస్తోన్న మంచి పనులను చూడకుండా లేనిపోని ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నాయని మండిపడ్డారు. అలాంటి పార్టీలకు ఈ ఎన్నికల్లో వరంగల్ ప్రజలు ఓట్ల రూపంలో బుద్ది చెప్పాలని కోరారు.వరంగల్ లోక్‌సభలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పసునూరి దయాకర్ విూ దీవెనల కోసం విూ ముందుకు వచ్చారని ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. తమ టీఆర్ఎస్ ప్రభుత్వ పదహారు నెలల పాలనలో ఏదో ధ్వంసమైనట్టు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. 58 ఏండ్ల సమైక్య పాలనలో ఎన్నో కష్టాలు పడ్డ విషయాన్ని గుర్తు చేశారు.అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలోనే కరెంట్ కోతలు లేకుండా చేశామన్నారు. అలాంటిది వాళ్ల పాలన కాలంలో జరిగిన విషయాల్ని మరిచి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ ఓటర్లు అలాంటి పార్టీలకు ఓట్లతో బుద్ది చెప్పాలని విజ్ఞప్తి చేశారు. అడ్డదిడ్డంగా మాట్లాడేవారికి సరియైన శిక్ష విధించడమే కరెక్టన్నారు. టీఆర్ఎస్ పార్టీ స్థాపించిందే తెలంగాణ బాగు కోసమని తెలిపారు. 14 ఏళ్లు ఉద్యమం చేసి చివరికి రాష్ట్రాన్ని సాధించామని వివరించారు. త్వరలో అన్ని సమస్యలు పరిస్కరించేందుకు కృషి చేస్తామన్నారు.రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు చేపడుతోందని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రభుత్వం చేస్తోన్న పనులను వరంగల్ ఓటర్లు గమనించాలని విజ్ఞప్తి చేశారు. నిన్న హైదరాబాద్‌లో ఐడీహెచ్ కాలనీలో పేదలకు నాలుగు వందల డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇంకా రూ.4 వేల కోట్లతో 60 వేల ఇండ్లను నిర్మిస్తామని ప్రకటించారు. ప్రతీ నియోజకవర్గానికి సంవత్సరానికి వెయ్యి ఇండ్లు కేటాయించేలా చూస్తామన్నారు.నాటి ప్రభుత్వాలు డబ్బాల్లాంటి ఇండ్లు నిర్మించి ఇచ్చి ఇదే స్వర్గమని అన్నాయి. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇస్తుందని తెలిపారు. అందుకే ఓటు వేసే ముందు ఓటర్లు బాగా ఆలోచించాలని కోరారు. ప్రభుత్వ పనితీరును చూసి ఓటు వేయలాని విజ్ఞప్తి చేశారు.సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడు జానారెడ్డిపై నిప్పులు చెరిగారు. జానారెడ్డికి విజయభాస్కర్‌రెడ్డి మంత్రి పదవి ఇవ్వకపోతే తెలంగాణ పోరమ్ పెడతానని బెదిరించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ ఫోరమ్ పెడదాం రమ్మని తనను కూడా ఆహ్వానించారని ఫోరమ్‌ను కూడా ఏర్పాటు చేశారని సీఎం తెలిపారు. కానీ తాను ఫోరమ్లోకి వెళ్లలేదని వివరించారు. తెల్లారిందోలేదో విజయభాస్కర్‌రెడ్డి మంత్రి పదవి ఇస్తాననగానే జానారెడ్డి తెలంగాణ ఫోరమ్‌ను మూసి వేశారని దుయ్యబట్టారు. ఇది జానారెడ్డి చరిత్ర అని వివరించారు.రైతు సంక్షేమం కోసం తమ టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోన్న విషయం అందరికి తెలుసని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆనాటి ప్రభుత్వాలు రైతులను విస్మరించాయని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం రైతులకు సాగునీటిని అందించేందుకు అనేక ప్రణాళికలు రూపొందిస్తుందని వివరించారు. రైతుల కోసం కోటి ఎకరాలకు సాగునీటిని అందించే వరకు నిద్రపోనని తెలిపారు. పసునూరి దయాకర్‌ను గెలిపించి తనకు బలంను ఇవ్వాలని సభకు వచ్చిన జనానికి విజ్ఞప్తి చేశారు. మన బలం పెరిగితే మన అవసరాల కోసం పార్లమెంట్లో కొట్లాడే అవకాశం ఉంటుందని వివరించారు.సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విపక్ష పార్టీలపై నిప్పులు చెరిగారు. తమ ప్రభుత్వం చేస్తోన్న మంచి పనులను ప్రతిపక్షాలు చూడటంలేదని విమర్శించారు. వాళ్ల పాలనలో చేసిన తప్పిదాలను తాము సరిదిద్దుతున్నామని పేర్కొన్నారు. బీహార్‌లో చావు దెబ్బతిన్న బీజేపీ నేతలు పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే చేయని దద్దమ్మ కిషన్‌రెడ్డి కూడా తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పత్తికొనుగోలుకు సీసీఐకి తగిన డబ్బు ఇవ్వకపోవడం కేంద్రం తప్పిదం కాదా? అని సీఎం నిలదీశారు. పత్తి రైతులకు మద్దతు ధర పెంచాల్సింది కేంద్రం కాదా? కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని సవాలు విసిరారు. అసలు ప్రజల కోసం వాళ్ల బీజేపీ ప్రభుత్వం చేసిన ఒక మంచి పనిని కిషన్ రెడ్డి చెప్పాలని అన్నారు. విూరు ఒక మంచి పనిచేశారని నిరూపిస్తే విూకు సలాం కొడతానని స్పష్టం చేశారు.ఎన్నికలపుడు ఓట్ల కోసం ఓటర్ల వద్దకు వచ్చి మంచి పనులు చేస్తామని దండం పెట్టి ఓట్లు అడగాలి కానీ ఇతర పార్టీలపై విమర్శలు చేయడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న పనుల గురించి ప్రజలకు తెలుసని వెల్లడించారు.టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపట్టిందని సీఎం వివరించారు. వచ్చే రెండున్నరేళ్లలో ఆడబిడ్డ మంచినీటి కోసం గడప దాటదని తెలిపారు. వాటర్ గ్రిడ్ పథకం ద్వారా ఇంటింటికి మంచినీటిని అందిస్తామన్నారు. ఇంటింటికి మంచినీటిని అందించకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇచ్చిన వాగ్దానం చేయకపోతే ఓట్లు అడగమని చెప్పిన ప్రభుత్వాన్ని చూశారా? అని అన్నారు. ఇలా దేశంలో ఇప్పటి వరకు ఏ సీఎం కూడా వాగ్దానం చేయలేదని వివరించారు.కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రతీ పేద బాలికకు అందేలా చర్యలు తీసుకుంటామని హావిూ ఇచ్చారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చేశామన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు దేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వనంత పెన్షన్ ఇస్తున్నామన్నారు. ఆనాడు అంగన్వాడి కార్యకర్తలు వేతనాలు పెంచమని అడిగితే గుర్రాలతో తొక్కించారని విమర్శించారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలను పిలిచి చర్చించి వారి సమస్యలను పరిష్కరించిందన్నారు.




